వ్యవసాయ రంగం అభివృద్ధితోనే బంగారు తెలంగాణ సాధ్యమని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. హైదరాబాద్ లో ని హైటెక్స్ లో జరిగిన రైతు హిత సదస్సులో అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రైతాంగం బాగుపడాలంటే తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా ప్రసంగించారు. బంగారు తెలంగాణ గమ్యం చేరేందుకు వ్యవసాయశాఖ దిక్సూచిలా పనిచేయాలని కోరారు. వ్యవసాయంపై రైతులకు పూర్తి అవగాహన కల్పించేలా పనిచేయాలన్నారు. రైతులకు అర్థమయ్యేలా విధి విధానాలు రూపొందించాలని సూచించారు.
తెలంగాణ భూములను పంటల కాలనీలుగా విభజించి అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. దేశంలోనే ఏ రాష్ట్రానికి లేనంత వృద్ధి రేటు తెలంగాణకు ఉందన్నారు. 21 శాతం వృద్ధి రేటుతో నెంబర్ వన్ స్థానంలో ఉన్న తెలంగాణ వ్యవసారంగంలో నష్టాల్లో ఉండటంపై విచారం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాల విధానాల వల్ల రాష్ట్రంలో వ్యవసాయం కుంటుపడిందన్నారు. పకడ్బందీ ప్రణాళికతో వ్వవసాయ రంగాన్ని గాడిలో పెడ్తామన్నారు.
వ్వవసాయ శాఖను పటిష్ఠపర్చే దిశగా తెలంగాణ సర్కారు శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కొత్తగా ఏఈవోలను నియమించడంతో పాటు పదోన్నతలు కల్పించింది. తాజాగా మరో 500 మంది ఏఈవోలను నియమిస్తామని రైతు హిత సదస్సులో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇక వ్యవసాయ శాఖ అధికారులకు ల్యాప్ ట్యాప్‌లు, కంప్యూటర్లతో పాటు క్షేత్ర స్థాయిలో తిరిగేందుకు బైక్స్ పంపిణీ చేస్తామన్నారు.
లక్ష కిలోమీటర్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుందని… రైతు హిత సదస్సులో తెలంగాణ సర్కారు వేసే అడుగు దేశానికే దిక్సూచిగా మారుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. రైతులకు ఎరువుల పంపిణీ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ పథకాన్ని మెచ్చుకున్నారని చెప్పారు.
అవినీతి, అక్రమాలను సహించేది లేదని రైతు హిత సదస్సులో సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. వ్యవసాయ రంగ పథకాల అమలులో దళారీ వ్యవస్థపై ఉక్కుపాదం మోపుతామన్నారు. అవినీతి నిర్మూలనలో ఏఈవోలు కీలక పాత్ర పోషించాలని సూచించారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు ఉన్న వ్యవసాయ భూముల లెక్కలు పకడ్బందీగా లేవని సీఎం కేసీఆర్ అన్నారు. ఏ రైతు పేరిట ఎంత భూమి ఉందో ఇంటిపేరుతో సహా వివరాలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఏ పొలంలో ఏ పంట ఉందో అన్న వివరాలు వీలైనంత తొందరగా వ్వయసాయ శాఖ మంత్రి టేబుల్‌పై ఉండాలన్నారు.
యాదవులు నిజమైన మానవ అభివృద్ధి సూచికలని సీఎం కేసీఆర్ అభివర్ణించారు. రాష్ట్రంలో 30 లక్షల మంది గొల్ల, కురుమలు ఉన్నారని… 20 వేల కోట్ల ఆదాయం సృష్టించగల సత్తా వీరికుందని చెప్పారు. త్వరలోనే గొర్రెలు దిగుమతి చేసుకునే స్థితి నుంచి ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీతో పాటు… 75 శాతం సబ్సిడీపై గడ్డి విత్తనాలు సరఫరా చేస్తామని చెప్పారు.
రాష్ట్రంలో ప్రతి గ్రామంలో రైతు సంఘాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ రైతు హిత సదస్సులో వ్యవసాయ అధికారులకు సూచించారు. మండల సంఘాల ఆధారంగా జిల్లా రైతు సంఘాలు ఏర్పాటు చేసి… రాష్ట్రంలో రైతు సమాఖ్యను ఏర్పాటు చేయాలన్నారు. రైతు సమాఖ్యకు 500 కోట్లు కేటాయిస్తామన్నారు. జూన్ 10 లోపు వ్యవసాయ యాంత్రీకరణ లెక్కులు తేలాలని ఆదేశించారు.
అలుపెరగని పోరాటంతో తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన యోధుడు… రైతు హిత సదస్సులో మరోసారి తన నిస్వార్థమైన లక్ష్యాన్ని నిక్కచ్చిగా చెప్పారు. తెలంగాణ పచ్చగా కళకళలాడటమే తన కోరికన్నారు. ప్రస్తుతం తన వయసు 64 ఏళ్లు, ఏ వ్యాపకాలు లేవని… ఎవరితో పంచాయితీ లేదన్నారు. సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ దేశానికే రోల్ మోడల్ అవుతుందన్నారు. అందరం కలిసి బంగారు తెలంగాణ సాధిద్దామని పిలుపునిచ్చారు.




