బిఆర్ఎస్ “కోట”లో వికసిస్తున్న కమలం..!
సెస్ ఎన్నికల ఫలితాలపై సర్వత్ర ఉత్కంఠ.
సిరిసిల్ల పట్టణంలో అంతర్గత విభేదాలు బిఆర్ఎస్ కొంప ముంచనున్నాయా.
జిల్లాలో సెస్ ఎన్నికల నేపథ్యంలో మారుతున్న రాజకీయ పరిణామాలు.
కాంగ్రెస్ ఖాతా తెరుస్తుందా..!
రేపు తెలనున్న అభ్యర్థుల భవితవ్యం.
జనం సాక్షి ప్రత్యకం.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. డిసెంబర్ 25. (జనంసాక్షి) ఉత్కంఠ భరితంగా జరిగిన సెస్ ఎన్నికలు జిల్లాలో పెను రాజకీయ మార్పులకు శ్రీకారం చుట్టానున్నాయా బిఆర్ఎస్ కంచుకోటలో కమలం వికసిస్తుందా అన్న ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ పరిశీలకులనే కాక సామాన్యులను కూడా వేధిస్తున్నవి. మంత్రి కేటీఆర్ జిల్లాలో చేసిన అభివృద్ధి పనులు అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం తీసుకున్న ప్రత్యేక చొరవ సునాయాసంగా బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల విజయానికి దోహదం చేయాల్సిన పరిస్థితులు లేకుండా పోవడం వెనుక పార్టీ నాయకుల మధ్య సమన్వయం లేకుండా పోవడమే కారణం అవుతుందని పలువురుసీనియర్ నాయకులు చెపుతున్న మాట. బిఆర్ఎస్ జండా పక్కన ఉంటే చాలు విజయం సొంతం అనుకున్న దిశ నుంచి సర్వశక్తులు ఒడ్డే పరిస్థితికి బిఆర్ఎస్ వెళ్లాల్సి రావడం ఆ పార్టీలో అంతర్గతంగా నాయకుల మధ్య ఉన్న విభేదాలను తొలగించి పరిస్థితులు చక్కదిద్ది అందరిని ఐక్యంగా నడిపించవలసిన నాయకత్వ వైపల్యం ఎన్నికల్లో కమలానికి కలిసొచ్చే అంశాలు.
జిల్లాలోని మండలాల్లో నాయకులను సమన్వయం చేస్తూ ముందుకు వెళ్లడంలో బిఆర్ఎస్ నాయకత్వం కొంత వరకు సఫలమైన మంత్రి కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో మాత్రం పూర్తిగా నాయకత్వం విఫలమైందని చెప్పొచ్చని రాజకీయా పరిశీలకులు చెపుతున్న మాట.. సిరిసిల్ల టౌన్ వన్, టౌన్ టు లో నెలకొన్న పరిస్థితులు వీటికి అర్థం పడుతున్నాయి.ఈ రెండు సిగ్మెంట్లలో జరిగిన ఎన్నికల తీరును పరిశీలిస్తే పరిస్థితి స్పష్టమవుతుంది. అంతర్గత విభేదాలతో బిఆర్ఎస్ నేతలు తలమునకలై ఉంటే కమలం నేతలు మాత్రం పరిస్థితులను తమకు అనుకూలంగా మాలుచుకుని తమ బలపరిచిన అభ్యర్థులను గెలిపించడం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరించించడం బిఆర్ఎస్ కు కష్ట కాలాన్ని తెచ్చిపెట్టే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. టౌన్ టూ లో స్వతంత్ర అభ్యర్థికి ప్రచారం చేస్తున్ననంటు విమర్శలు చేయడంపై మనస్థాపంతో కంటతడి పెట్టిన బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ పత్తిపాక పద్మ పార్టీకి రాజీనామా చేయడం పెద్ద దుమారం రేపింది. ఇంత జరుగుతున్న స్థానిక నాయకత్వం పరిస్థితులను అంచనా వేయడంలో పూర్తిగా విఫలమైందని పార్టీలోని కొంతమంది సీనియర్లు బాహాటంగానే విమర్శిస్తున్నారు. సునాయాసంగా గెలవాల్సిన ఈ రెండు సెగ్మెంట్లలో ఇప్పుడు బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు ఎదురీత తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి.
మొత్తం గా సెస్ ఎన్నికల సరళని పరిశీలిస్తే జిల్లాలోని మొత్తం 15 సెగ్మెంట్లు బిఆర్ఎస్ బిజెపి బలపరిచిన అభ్యర్థుల మధ్య ప్రధానంగా పోటాపోటీ నడిచినట్లు కనిపించింది. వేములవాడ నియోజకవర్గం లోని బిజెపి బలపరిచిన అభ్యర్థులు విజయంపై ఆశలు పెట్టుకున్నారు. దాదాపు అన్ని సెగ్మెంట్లలో కమలం అభ్యర్థులు బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు గట్టి పోటీలు ఇచ్చినట్లు కనిపిస్తోంది. వేములవాడ నియోజకవర్గం కొన్ని సిగ్నెంట్లు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు కూడా గట్టి పోటీ ఇచ్చారు. ఓ సిగ్మెట్లు గెలుపు పై కాంగ్రెస్ ఆశలు పెట్టుకోంది. సిరిసిల్ల నియోజకవర్గం లో కాంగ్రెస్ ఖాతా తెరుస్తుందా లేదా అన్నది సందేహం కాకపోతే బరిలో నిలబడిన తీరు మాత్రం ఆ పార్టీకి భవిష్యత్తులో బలంగా నిలబడేందుకు దోహదం చేసే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటివరకు ఏ ఎన్నికల్లో కూడా ఎదురులేకుండా నిలబడిన బిఆర్ఎస్ కంచుకోటలో కమలం జెండా ఎగురవేసేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో కొంత మేరకు సఫలమైందనే రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.. అభివృద్ధి చేసి అధికారంలో ఉండి విజయాన్ని సునాయసంగా తన ఖాతాలో వేసుకోవలసిన బిఆర్ఎస్ పార్టీ అంతర్గత విభేదాలతో బీటలు వారుతుందా..అన్నది పూర్తిస్థాయి ఎన్నికల ఫలితాలు వచ్చాకే తెలుస్తుంది. పలు సిగ్మెంట్లు పలు ఇండిపెండెంట్ లు సైతం అధికార పార్టీకి చెమటలు పట్టించిన పరిస్థితి కనిపిస్తుంది. నేడు వేలువడనున్న ఫలితాలు అభ్యర్థుల గెలుపు ఓటములతో పాటు పార్టీల భవితవ్యాన్ని తేల్చనున్నాయి. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సెస్ ఎన్నికల ఫలితాలపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.




