Monday, 2 November 2026

బిజినెస్‌లో మనమే నంబర్‌ వన్‌

– ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో తెలంగాణకు ఫస్ట్‌ ప్లేస్‌

– మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 16,(జనంసాక్షి):ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇవాళ నగరంలోని బేగంపేట హరిత ప్లాజాలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్‌.. మూతపడ్డ పరిశ్రమలను పునరుద్ధరించేందుకు ఇండస్ట్రియల్‌ హెల్త్‌ క్లినిక్స్‌ ఏర్పాటు చేశామన్నారు. బ్యాంకులు ఏక పక్షంగా వ్యవహరించొద్దన్నారు. తెలంగాణ ఏ విధంగా ముందుకు దూసుకెళ్తున్నదో అసోచామ్‌ నివేదిక స్పష్టం చేసిందన్నారు. తెలంగాణ మోస్ట్‌ ప్రోగ్రెసివ్‌ అండ్‌ డైనమిక్‌ స్టేట్‌ అని కేంద్ర మంత్రి సురేశ్‌ ప్రభు ప్రశంసించారని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. అగ్ర భాగాన్ని నిలబెట్టుకోవడమే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న సవాల్‌ అని మంత్రి చెప్పారు. ఈ ఏడాదిలో 372 సంస్కరణలు తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. ఇక్కడి పారిశ్రామిక వేత్తలే బ్రాండ్‌ అంబాసిడర్లని సీఎం చెబుతుంటారని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. పరిశ్రమలపై పడుతున్న జీఎస్టీ భారం గురించి కేంద్రానికి వినిపించామని మంత్రి అన్నారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా తయారు కావాలని సీఎం కేసీఆర్‌ ఎప్పుడూ చెబుతుంటారని మంత్రి కేటీఆర్‌ తెలియజేశారు.