తమిళనాడు, జార్ఖండ్ సీఎంలు స్టాలిన్, సొరేన్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ రాక
రెట్టించిన ఉత్సాహంతో రెండోసభ
ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల, జాతీయ స్థాయి నేతల రాకతో ఖమ్మం సభ ఉర్రూతలూగింది. ఈ నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే సభకు తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, బీహార్ సీఎం నితీశ్‌కుమార్ తరఫున ఆయన ప్రతినిధిగా జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ తదితర ముఖ్య నేతలు, వివిధ సంఘాలు, వర్గాల ప్రతినిధులు వస్తున్నారు. సచివాలయ ప్రారంభోత్సవం తర్వాత జరిగే సభలో వీరంతా పాల్గొంటారు.
ఖమ్మంలో జరిగిన తొలి బహిరంగ సభతో దుమ్ములేపిన బీఆర్ఎస్ .. దూకుడు మరింత పెంచుతున్నది. జాతీయస్థాయిలో ప్రభావం చూపేలా రెండో సభకు సిద్ధమవుతున్నది. ఫిబ్రవరి 17న హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నది. ఈ సారి కూడా ఉత్తర, దక్షిణ భారతాల సమ్మేళనంగా సభావేదిక కనిపించనున్నది. ఖమ్మం సభకు ఢిల్లీ, కేరళ, పంజాబ్ ముఖ్యమంత్రులు హాజరవగా.. ఈ సారి సభకు తమిళనాడు, జార్ఖండ్ సీఎంలు ఎంకే స్టాలిన్, హేమంత్ సొరేన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీయాదవ్ రానున్నారు. 17న ఉదయం నూతన సెక్రటేరియట్ ప్రారంభ కార్యక్రమంలో వారు అతిథులుగా పాల్గొననున్నారు.
సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా హైదరాబాద్‌లోని పెరేడ్ గ్రౌండ్లో రెండో భారీ బహిరంగ సభను నిర్వహించాలని తలపెట్టారు. హిందీతో పాటు ఉత్తరాది మాండలికాలను బాగా అర్థం చేసుకొనే ప్రజలు ఇక్కడ ఉంటారు. పైపెచ్చు తమిళనాడు, బీహార్, జార్ఖండ్ నుంచి వచ్చిన ప్రజలు హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంటున్నారు. సభ ఇక్కడ పెట్టడం వల్ల ఆయా వర్గాల వారిని, ఆయా రాష్ర్టాల ప్రజలను ప్రభావితం చేయొచ్చన్నది సీఎం కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తున్నది. మొట్టమొదటి సభ ఖమ్మంలో నిర్వహించటం వల్ల తెలుగు రాష్ర్టాలతోపాటు పక్కనే ఉన్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా ప్రజలు, నాయకులు తరలివచ్చారు. ఇప్పుడు హైదరాబాద్‌లో సభ నిర్వహిస్తే.. ఇక్కడ నివసించే వివిధ రాష్ర్టాల ప్రజల సొంత ప్రాంతాల్లో బీఆర్ఎస్ పేరు వినపడేలా, ప్రజలు చర్చించేలా చేస్తున్నారు.
బీఆర్ఎస్ మలికేక.. ఫిబ్రవరి 17న పరేడ్‌గ్రౌండ్స్‌లో భారీ సభ




