Wednesday, 4 November 2026

బీచుపల్లి పుణ్యక్షేత్రంలో సీతారాముల కళ్యాణం

ఇటిక్యాల (జనంసాక్షి) మే 24 :
మండల పరిధిలోని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో బుధవారం సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. పునర్వసు నక్షత్రం సందర్భంగా వేద పండితులు శ్రీ దత్తుస్వామి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు మండల కేంద్రంతో పాటు తిమ్మాపురం, కొండపేట, యాక్తాపురం, ఎర్రవల్లి చౌరస్తా, షేక్ పల్లి, జింకలపల్లి, కొండేరు, కోదండాపురం, సాసనూలు, దువాసిపల్లి, ఆర్.గార్లపాడు పెద్దదిన్నె, పుటాన్దొడ్డి, ధర్మవరం కాక పెబ్బేరు,వనపర్తి, గద్వాల ప్రాంతాల నుండి భక్తులు బీచుపల్లి పుణ్యక్షేత్రానికి చేరుకొని సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. సీతారాముల కళ్యాణం జరిపించేందుకు ఆలయ పాలక మండలి వారు పట్టు వస్త్రాలను, అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆలయ నిర్వాహకులు సురేందర్ రాజు తెలిపారు.