బీహారీలకు కాలి బొబ్బలు. కన్నీళ్లే మిగిలాయి

– మార్పు కోరుతూ ఓటు వేయండి

– కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ

దిల్లీ,అక్టోబరు 27(జనంసాక్షి): ప్రస్తుతం బిహార్‌లో అధికారంలో ఉన్న పార్టీ గాడితప్పిందని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. వారు చెప్పే మాటలు కానీ.. చేసే పనులు కానీ ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు నిరాశకు గురయ్యాయన్నారు. ఈ నేపథ్యంలో బిహార్‌ ప్రజలంతా మహాకూటమి వెంటే ఉన్నారని అభిప్రాయపడ్డారు. రేపు బిహార్‌ అసెంబ్లీకి తొలి విడత పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో ప్రజలనుద్దేశించి మంగళవారం ఆమె వీడియో ద్వారా సందేశం ఇచ్చారు. ఈ వీడియోను తన ట్విటర్‌ వేదికగా రాహుల్‌గాంధీ విడుదల చేశారు. సరికొత్త బిహార్‌ నిర్మాణం కోసం మహాకూటమిని గెలిపించాల్సిన సమయం ఆసన్నమైందని రాహుల్‌ పిలుపునిచ్చారు. ”బిహార్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం పూర్తిగా అహంకారంలో కూరుకుపోయి గాడితప్పింది. వారి మాటలు కానీ.. చేతలు కానీ ఏమాత్రం ఆమోదనీయంగా లేవు. కార్మికుల జీవితాలు దుర్బరంగా మారాయి. రైతులు తీవ్ర విచారంలో ఉన్నారు. యువత నిరాశలో కూరుకుపోయింది. కుచించుకుపోతున్న ఆర్థిక వ్యవస్థ సాధారణ ప్రజానీకంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దళితులు, మహా దళితులు నిరంతరం అణచివేతకు గురవుతున్నారు. ఇటు కేంద్రంలో.. అటు బిహార్‌లో ‘బంద్‌’ప్రభుత్వాలు నడుస్తున్నాయి. వాళ్లకి నోట్‌బందీ(నోట్ల రద్దు), ఆర్థిక వ్యవస్థను కుంగదీసేలా లాక్‌డౌన్‌లు విధించడం, ఉపాధిని కొల్లగొట్టడం, రైతులను సంక్షోభంలోకి నెట్టడం వంటి చర్యలు తప్ప మరేవిూ తెలియదు. బిహార్‌లో నాణ్యత, ప్రతిభ, బలం, నిర్మాణ శక్తి ఉన్నాయి. కానీ నిరుద్యోగం, వలసలు, ద్రవ్యోల్బణం, ఆకలి వారికి కన్నీళ్లు, కాలి బొబ్బల్ని మిగిల్చాయి. భయం, నేరాల ఆధారంగా ప్రభుత్వాలు ఏర్పడలేవు” అంటూ బిహార్‌లో నెలకొన్న సమస్యల్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు భాజపా సర్కార్‌పై విరుచుకుపడ్డారు. విజ్ఞాన కేంద్రంగా చెప్పే బిహార్‌లో ప్రజలు మహాకూటమి వెంటే ఉన్నారన్నారు. మార్పు కోసం కూటమికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. బిహార్‌లో 16 జిల్లాలో విస్తరించి ఉన్న 71 స్థానాలకు బుధవారం తొలి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 10,066 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మహాకూటమి పేరిట కాంగ్రెస్‌, ఆర్జేడీ, సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్‌ కలిసి పోటీ చేస్తున్నాయి. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ను కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు.