బోటు ప్రమాదంపై సుప్రీంలో పిటీషన్‌

– మృతదేహాలను వెలికితీసేలా ప్రభుత్వాలకు ఆదేశాలివ్వండి
– పిటీషన్‌లో మాజీ ఎంపీ హర్షకుమార్‌ విజ్ఞప్తి
న్యూఢిల్లీ, అక్టోబర్‌5 (జనంసాక్షి):  గోదావరిలో బోటు ప్రమాదంపై మాజీ ఎంపీ హర్షకుమార్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. బోటుతో పాటు మిగిలిన మృతదేహాలను వెలికితీసేలా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో కోరారు. బోటు వెలికితీతపై నిర్లక్ష్యం చేస్తున్నారని హర్షకుమార్‌ పేర్కొన్నారు. బోటు ప్రమాదంపై హర్షకుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. టూరిజం బోట్లలో మంత్రులు, ఎమ్మెల్యేలకు వాటాలున్నాయని ఆరోపించారు. ప్రమాదం ముందు పోలీసులు తీసిన ఫొటోలు, సెల్‌ఫోన్‌ సంభాషణలను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. బోటును వెలికితీయడం అధికారులకు ఇష్టం లేదన్నారు. వైఎస్‌ గల్లంతైనప్పుడు బాధేంటో ముఖ్యమంత్రి జగన్‌కు తెలుసు అని, ముఖ్యమంత్రి బోటు బాధితుల బాధను అర్థం చేసుకోవాలన్నారు.  పుష్కరాల్లో 28మంది చనిపోతే అధికారులను ఎందుకు సస్పెండ్‌ చేయలేదని అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని జగన్‌ డిమాండ్‌ చేశారని, ఇప్పుడు బోటు ఘటనపై జగన్‌ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హర్షకుమార్‌ ప్రశ్నించారు. మరోవైపు బోటు ప్రమాద మృతుల సంఖ్యపై తప్పుదారి పట్టించారని హర్షకుమార్‌పై కేసు నమోదు అయింది. హర్షకుమార్‌ అరెస్ట్‌ కోసం ప్రత్యేక టీమ్స్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. హర్షకుమార్‌ తప్పించుకోవడానికి సహకరించారనే కారణంతో రాజమండ్రి త్రీటౌన్‌ సీఐ శేఖర్‌బాబును సస్పెండ్‌ చేశారు.