హైదరాబాద్ : బ్యాంకర్ల పనితీరుపై తెలంగాణ సర్కారు.. అసహనం వెళ్లగక్కింది. బ్యాంకులు.. రుణమాఫీని లైట్‌గా తీసుకున్నాయని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఖరీఫ్ ముగుస్తున్నా సగం మంది రైతులకు రుణాలు అందించలేదని ఆగ్రహించింది. రైతుల నుంచి వడ్డీని వసూలు చేయడాన్ని మంత్రులు తప్పుబట్టారు. ఇక నుంచైనా బ్యాంకర్లు తీరు మార్చుకుని రైతులకు మేలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ అనుకున్నంత సజావుగా సాగటం లేదని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. రైతులకు రుణాలను చేరవేయడంలో బ్యాంకర్ల పనితీరు సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. రుణమాఫీ అమలు, కొత్త రుణాల మంజూరు తదితర అంశాలపై ప్రభుత్వం ఎస్ఎల్ బిసి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మంత్రులు ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు పలు బ్యాంకులకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారురుణమాఫీ అమల్లో జాప్యం జరగటం పట్ల బ్యాంకర్లను ప్రశ్నించిన మంత్రులు.. కొన్ని చోట్ల వడ్డీలు కూడా వసూలు చేయడాన్ని తప్పుబట్టారు. ఖరీఫ్ మరో 20 రోజుల్లో ముగుస్తుందని.. అప్పటిలోగా రుణాలన్నీ మాఫీ చేసి అర్హులందరికీ కొత్త రుణాలు అందించాలని మంత్రులు బ్యాంకర్లను ఆదేశించారు. ఇదే సమయంలో రుణమాఫీలో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని గుర్తించిన మంత్రులు.. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారుఇదిలా ఉంటే.. పాత రుణాల మాఫీ ఎంత మేర జరిగిందన్న అంశాలతో పాటు.. కొత్త రుణాల లక్ష్యాన్ని ప్రభుత్వం బ్యాంకర్లను నిర్ధేశించింది. ఈ ఏడాదికి అన్ని రంగాలకు కలిపి 78 వేల 776 కోట్ల రుణాలు అందించేందుకు బ్యాంకర్లు అంగీకరించాయి. వ్యవసాయ రంగానికి సంబంధించి ఖరీఫ్, రబీకి కలిపి మొత్తం 25 వేల కొత్త రుణాలు అందిస్తామని బ్యాంకర్లు హమీ ఇచ్చాయి. రుణ మాఫీని పూర్తి స్థాయిలో అమలు పరచాలని పట్టుదలగా ఉన్న తెలంగాణ సర్కారు.. రుణమాఫీ విషయంలో వస్తున్న విమర్శలను అధిగమించేందుకు ప్రతివారం బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపధ్యంలో ప్రభుత్వం ప్రయత్నాలను బ్యాంకర్లు ఎంత మేర నేరవేరుస్తారో చూడాలి.




