Wednesday, 4 November 2026

భాగ్యనగర్‌ ఉత్సవ సమితికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌ : సెంట్రల్‌ జోన్‌ డీసీపీ సూచించిన విధంగా వేదిక మార్చుకొని అనుమతి కోసం తిరిగి దరఖాస్తు చేసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ.శేషసాయి శుక్రవారం భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి ప్రతినిధులకు సూచించారు. వేదిక మార్చుకొని ఇచ్చిన దరఖాస్తును నేటి సాయంత్రంలోగా నిర్ణయం తీసుకోవాలని సెంట్రల్‌ జోన్‌ పోలీసులను ఆదేశించారు. వినాయక నవరాత్రులు సందర్భంగా జంటనగరాల్లోని వినాయక మండపాల నిర్వాహకులతో ఈనెల 13న ఎన్టీఆర్‌ స్టేడియంలో సమావేశం అవ్వాలని నిర్ణయించామని, ఈ మేరకు అనుమతించాలని కోరుతూ భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమతి ప్రధాన కార్యదర్శి భగవంత్‌రావు శుక్రవారం లంచ్‌ మోషన్‌లో హైకోర్టును ఆశ్రయించారు. వినాయక మండపాల నిర్వాహకులతో ఏర్పాటు చేయతలపెట్టిన సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించారని కోర్టు దృష్టికి తెచ్చారు. పిటిషనర్ల తరపు వాదనలకు స్పెషల్‌ జీపీ శరత్‌ అభ్యంతరం చెప్పారు. వేదిక మార్చుకుంటే పరిశీలిస్తామని పోలీసులు చెప్పారని, నిర్వాహకులు వేదిక మార్చుకోకుండా కోర్టును ఆశ్రయించారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు సెంట్రల్‌ జోన్‌ డీసీపీ సూచించిన విధంగా వేదిక మార్చుకొని దరఖాస్తు చేసుకోవాలని ఉత్సవ సమితి ప్రతినిధులకు సూచించిన హైకోర్టు ఈ దరఖాస్తును శనివారం సాయంత్రంలోగా నిర్ణయం తీసుకోవాలని పోలీసులకు న్యాయమూర్తి ఆదేశాలుజారీచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *