భారత్ సూపర్ పవర్ గా ఎదగాలి
ఘనంగా సామూహిక జాతీయ గీతాలాపన
* గాంధీ చరిత్రను నేటి తరానికి తెలియలి
* రాష్ట్ర మంత్రి గంగుల , ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్
కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) :
భారతదేశ స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాల నాటికి ఇండియా సాఫ్ట్ సూపర్ పవర్ గా ఎదగాలని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్,రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సామూహిక గీతాలాపన కార్యక్రమంలో భాగంగా మంగళవారం పట్టణంలోని గీతా భవన్ వద్ద నిర్వహించిన జాతీయ గీతాలాపన కార్యక్రమంలో విద్యార్థులు, నగరవాసులతో కలిసి వారు సామూహికంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా 15 రోజులపాటు ఉత్సవాలను నిర్వహించుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారన్నారు.నేటి తరానికి స్వాతంత్ర ఉద్యమం గురించి స్పష్టమైన అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారని తెలిపారు.
స్వాతంత్ర పోరాట యోధులు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ చరిత్రను కొందరు వక్రీకరిస్తున్నారని అన్నారు. మహాత్మా గాంధీ చరిత్రను నేటితరానికి తెలిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని,ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో మహాత్మా గాంధీ సినిమాను ప్రదర్శిస్తున్నాం అన్నారు.
సూపర్ పవర్ అంటే అమెరికా రష్యా దేశాలు అని,ఆర్మ్స్,అణ్వస్త్రాలు, జెట్ విమానాలు, బాంబర్స్ ఉంటేనే సూపర్ పవర్ దేశాలు అని మేము చదువుకున్నామని, రాబోయే 25 సంవత్సరాల వరకు భారతదేశం సూపర్ సాఫ్ట్ పవర్ కావాలని, సూపర్ సాఫ్ట్ పవర్ అంటే విద్యా,విజ్ఞానం, వ్యవసాయం, ఇండస్ట్రీస్ అన్నారు.భారత దేశాన్ని సూపర్ సాఫ్ట్ పవర్ గా తీర్చి దిద్దుకునేందుకు ప్రతి ఒక్కరు కంకణం కట్టుకోవాలన్నారు. 8 సంవత్సరాల తెరాస పాలనలో వెనుకబడిన తెలంగాణ అభివృద్ధి సాధించియావత్ దేశానికి దిక్సూచిగా నిలిచిందన్నారు.భారతదేశాన్ని గొప్ప దేశంగా తీర్చిదిద్దుకునేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శాంతి భద్రతలు ఉంటేనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు.మనిషి మనిషి మధ్య మానవత్వం, ప్రేమ సుహృద్భావ వాతావరణం నెలకొన్నప్పడే శాంతిభద్రతలు సాధ్యపడతాయని అప్పుడే భారతదేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్ రావు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ,జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ, suda చైర్మన్ జీవి రామకృష్ణ రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, కార్పొరేటర్లు, అధికారులు ,ఉద్యోగులు , విద్యార్థులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.