భారీగా పెరిగిన విమానయాన చార్జీలు విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకుంటున్న వారికి ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా విమాన చార్జీలు పెరిగాయి. 60 నుంచి 70 శాతం వరకు పెరగడంతో అమెరికా, ఇతర దేశాలకు చదువు కోసం వెళ్లేవారు లబోదిబోమంటున్నారు. మరీ ముఖ్యంగా ఆగస్టు మాసంలో ఎక్కువ రేట్లు నమోదయ్యాయి. కోవిడ్‌కు ముందు అమెరికాకు విమాన చార్జీ రూ.80 వేల నుంచి రూ.90 వేల వరకూ మాత్రమే ఉండేది.ఈ ఏడాది ఆగస్టులో అమెరికా వెళ్లే వారు కనీసం రూ.1.60 లక్షలు విమాన టికెట్‌కే వెచ్చించాల్సి వస్తోంది. దీంతో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. బ్రిటన్, కెనడా, ఆ్రస్టేలియా తదితర దేశాలకూ వెళుతున్న వారు పదుల సంఖ్యలోనే ఉన్నారు.
రెండు మాసాల ముందు బుక్ చేసుకుంటేనే…
అమెరికాలో సెప్టెంబర్ నుంచి విద్యా సంవత్సరం మొదలవుతుంది. దీంతో ఆగస్ట్ 25 నాటికే అక్కడికి చేరుకుంటారు. ఇందుకోసం జూన్‌లో విమాన టికెట్ బుక్ చేసుకున్న వారికి రమారమి రూ.1.55 లక్షలు అయ్యింది. ఇక అప్పటికప్పుడు అంటే రూ.2 లక్షల దాకా వెచ్చించాల్సి వస్తోందని , రోజు రోజుకూ చార్జీలు పెరుగుతున్నాయని, గత రెండు నెలల్లో పెరగడమే గానీ ఎప్పుడూ తగ్గలేదని పలువురు విద్యార్థులు తెలిపారు.
డాలర్ విలువ పెరగడంతో..
తాజాగా డాలర్‌తో రూపాయి మారకం విలువ సుమారు రూ.80కు పెరిగింది. దీనివల్ల అమెరికాకు వెళుతున్న భారతీయ విద్యార్థులపై పెనుభారం పడుతోంది. అమెరికాలో క్యూఎస్ ర్యాంకింగ్ 200 పైన ఉన్న ఏ యూనివర్సిటీలో అయినా కనీసం 40 వేల డాలర్ల ఫీజు ఉంటుంది. అదే వందలోపు ర్యాంకింగ్స్ ఉన్న వాటిలో 60 వేల నుంచి 70వేల డాలర్లు అవుతుంది. ప్రస్తుతం డాలర్ విలువ పెరగడంతో ఒక్కో విద్యార్థిపై రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ అదనపు భారం పడుతోంది.




