Wednesday, 4 November 2026

భూ కబ్జాలు చేయకుంటే బహిరంగ చర్చకు రావాలి..

– ప్రశ్నిస్తే దాడులు చేయడం చేతగానితనం.
– న్యాయపరంగా చర్యలు తీసుకోవాలి.
– మాజీ జాతీయ బీసీ కమీషన్ మెంబర్ తల్లోజు ఆచారి.
ఊరుకొండ, జనవరి 23 (జనంసాక్షి):
బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు భూకబ్జాలు చేయడమే పనిగా పెట్టుకుని.. ప్రశ్నించే వారిపై దాడులు చేయడం చేతకాని తనానికి నిదర్శనం అని.. భూకబ్జాలు చేయకుంటే స్థానిక ఎమ్మెల్యే బినామీ అయిన ముచ్చర్ల జనార్దన్ రెడ్డి, దాడికి పాల్పడిన టిఆర్ఎస్ నాయకులు బహిరంగ చర్చకు రావాలని మాజీ జాతీయ బీసీ కమీషన్ మెంబర్ తల్లోజు ఆచారి, బిజెపి జిల్లా అధ్యక్షులు ఎల్లేని సుధాకర్ రావులు అన్నారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండల కేంద్రములో మూడు రోజుల క్రితం ప్రభుత్వ భూములు అధికార పార్టీ నాయకులు వెంచర్ల పేరుతో బీటీ రోడ్లు, దేవాలయ భూములు భూ కబ్జాలు చేస్తున్నారని నర్సంపల్లి గ్రామ సర్పంచ్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు వాగుల్ దాస్ నిరంజన్ గౌడ్ అధికారులకు పిర్యాదు చేయగా.. మా పైనే పిర్యాదు చేస్తారా అంటూ, అధికార బీఅర్ఎస్ పార్టీ గూండాలు పోలీస్ అధికారుల ముందే దాడి చేయగా ఇచ్చిన ఫిర్యాదు పై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సభ్య సమాజం తల దించుకునే ఉందని మండిపడ్డారు. దాడి చేసిన దుండగులపై ప్రభుత్వ అధికారుల దృష్టికి, పోలీస్ శాఖ దృష్టికి తీసుకెళ్లిన, పట్టించుకోవడం లేదని, నామ మాత్రంగా కేసులు నమోదు చేసి, నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారని ఆయన విమర్శించారు. పోలీసు అధికారుల నిర్లక్ష్యంపై ఊరుకొండ పోలీస్ స్టేషన్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. రెండు రోజుల్లో దాడికి పాల్పడిన టిఆర్ఎస్ నాయకుల పై చర్య తీసుకోకపోతే.. దాడికి పది దాడి తప్పదని మాజీ జాతీయ బీసీ కమీషన్ మెంబర్ తల్లోజు ఆచారి హెచ్చరించారు. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే పై, స్థానిక నాయకుల పై లేదా అని హెచ్చరిస్తూ.. అధికారం చేతిలో ఉందని ఇష్టం వచ్చినట్టు భూకబ్జాలు చేస్తున్న బీఅర్ఎస్ గుండాలు దాడి చేయాలనుకుంటే, పోలీసులను పక్కకు పెట్టీ, దమ్ముంటే కొట్లడుకుందాంరా అంటు హెచ్చరించారు. ఏది ఏమైనా న్యాయపరంగా చూడాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు బాల త్రిపుర సుందరి, కృష్ణ గౌడ్, ఓర్సు ఆంజనేయులు, రాజేందర్ గౌడ్, పరశురాములు, వెంకటేష్, వివిధ మండలాల బిజెపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.