భూ నిర్వాసితులకు న్యాయం చేయండి

ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయిన్‌పల్లి వినోద్‌కుమార్‌ కు వినతి

కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) :
కరీంనగర్‌ నుంచి వరంగల్‌ జాతీయ రహదారి– 563 భూ సేకరణలో ఇండ్లు, ఇండ్ల స్థలాలు, వ్యవసాయ భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులమైన తమకు అవార్డీ పెంచి న్యాయం చేయాలని కోరుతూ చెంజర్ల, ఖాదర్‌గూడెం ఎన్‌హెచ్‌–563 భూనిర్వాసితులు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్‌పల్లి వినోద్‌కుమార్‌కు ఆయన నివాసంలో బుధవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా భూనిర్వాసితులు మాట్లాడుతూ మానకొండూర్‌ మండలంలోని చెంజర్ల , ఖాదర్‌గూడెం రెవెన్యూ గ్రామ పరిధిలో ఇండ్లు, ఇండ్ల స్థలాలు, వ్యవసాయ భూములు, బావులు, వ్యాపారాలు కోల్పోతున్న వారి భూములకు గుంట ఒక్కంటికి ధర రూ. 63 వేల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తామనడం సరికాదన్నారు. చెంజర్ల గ్రామం కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి 14 కిలో మీటర్ల దూరం మాత్రమే ఉండి, శాతవాహన అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ అధారిటి ( సుడా) పరిధిలో ఉండి మెట్ట ప్రాంతమైనందున పారిశ్రామికంగా అభివద్ధి చెందిందన్నారు. బహిరంగ మార్కెటులో కోల్పోతున్న భూముల ధరలు ఇండ్ల స్థలాలు గుంట ఒక్కంటికి ధర రూ. 8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు విలువ కలిగి , వ్యవసాయ భూములు గుంట ఒక్కంటికి ధర రూ. 4 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు విలువ కలిగియున్నందున ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం బహిరంగ మార్కెట్‌ ప్రకారం ఇప్పించాలని కోరారు.ఇండ్లు కోల్పోతున్న వారికి ఇంటి నిర్మాణమునకు అయ్యే ఖర్చులు పెరిగినందున, ఇండ్లు కోల్పోతున్న వారికి సరియైన నష్టపరిహారం ఇప్పించాలని తెలిపారు. భూ సేకరణ సర్వేయందు భూమి, ఇండ్లు, బావులు, బోరులు మొదలగునవి చాలా వరకు నమోదు చేయబడలేదని, కొంతమందికి నష్టపరిహార జాబితాలో చాలా తక్కువగా నమోదు వచ్చిందన్నారు.భూ నిర్వాసితులు మధ్య నష్టపరిహారంలో చాలా వ్యత్యాసాల వలన లబ్ధిదారులు నష్టపోతున్నారని,రీ సర్వే జరిపించి మాకు న్యాయం చేయాలని, ప్రభుత్వం ఇచ్చే అవార్డీని పెంచి అందించే విధంగా చొరవ తీసుకోవాలని వినోద్‌కుమార్‌ వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రెండు గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, భూనిర్వాసితులు పాల్గొన్నారు.