విమర్శలను పట్టించుకోని కెసిఆర్
యాగం ముగిసిన తరవాత స్పష్టత వచ్చే అవకాశం
హైదరాబాద్,జనవరి23(జనంసాక్షి): తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడన్నది ఇంకా తేలలేదు. సిఎం కెసిఆర్ ప్రస్తుతుం యాగ నిర్వహణలో ఉన్నారు. దీంతో ఆయన రాజకీయ కార్యకలాపాలను పక్కన పెట్టారు. బహుశా యాగం ముగిసిన తరవాత నెలఖారుకు విస్తరణ చేస్తారన్న ప్రచారం ఉంది. శాసనసభ ఎన్నికల్లో భారీ విజయం సాధించి.. రెండోసారి ప్రభుత్వాన్నిఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ పార్టీలో మంత్రి పదవులు ఆశిస్తున్న వారి సంఖ్యా అధికంగానే ఉంది. కొత్తవారితో పాటు పాతవారు కూడా పదవులను ఆశిస్తున్నారు. తక్కువ పరిమితిలో మంత్రి పదవులు ఇచ్చే అవకాశం మాత్రమే ఉండడంతో సిఎం కెసిఆర్ సమర్థులైన వారినే పదవుల్లో నియమిస్తారన్న ప్రచారం ఉంది. గతంలో వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్‌గా ఎన్నిక కావడంతో ఇప్పుడుప్రధానామైన వ్యవసాయ శాఖకు కూడా సమర్థుడైన వారిని తీసుకునే ఆలోచనలో ఉంది. దీనికి నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తి చూపుతున్నారు. భారీనీటిపారుదలకు కూడా సమర్థులను నియయమించాలని చూస్తున్నారు. ఎక్కువ మందికి పదవులను కల్పించడం కోసం పార్లమెంటరీ సెక్రెటరీల నియామకంపై దృష్టిపెట్టారు. కేబినెట్ ¬దాతో పార్లమెంటరీ సెక్రటరీల వ్యవస్థను ఏర్పాటు చేసి కొంత మందిని అక్కడ నియమించాలని భావిస్తున్నారు. అందుకోసం పకడ్బందీగా కసరత్తు చేస్తున్నారు. వారందరికీ తగిన ప్రాధాన్యత ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నెలఖరులో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. టీఆర్‌ఎస్ తొలి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరుగురు పార్లమెంటరీ సెక్రటరీలను నియమించారు. ప్రభుత్వ పరిపాలనా వ్యవహారాలకు వారిని అనుసంధానం చేశారు. ప్రతీ పార్లమెంటరీ సెక్రటరీకి కొన్ని శాఖలు కూడా కేటాయించారు. ఐతే పరిపాలనాపరమైన వ్యవహారాలు నెరిపేలా పార్లమెంటరీ సెక్రటరీలను నియమించడాన్ని హైకోర్టు అప్పట్లో తప్పు ప్టటింది. మంత్రులు మినహా ఇతరులెవరికీ, పాలనా వ్యవహారాలతో సంబంధం ఉండరాదని సూత్రీకరించింది. అలా చేస్తే క్యాబినెట్ కూర్పు 15 శాతం మించిపోయినట్లవుతుందని కోర్టు అభిప్రాయపడింది. అందుకే ఈసారి పార్లమెంటరీ సెక్రటరీల నియామకం కోర్టు వివాదాల్లో చిక్కుకోకుండా ఉండేలా చట్టం రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. మంత్రులకు సహాయకులుగా వ్యవహరిస్తూ, భవిష్యత్తులో మంత్రులుగా పని చేయడానికి అవసరమైన అన్ని విషయాలపై శిక్షణ పొందే విధంగా, క్యాబినెట్ రాంక్ తో పార్లమెంటరీ సెక్రెటరీల వ్యవస్థ ఉండేలా చర్యలు తీసుకోనుందని సమాచారం. ఐతే సభల్లో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పే అధికారం పార్లమెంటరీ సెక్రెటరీలకు ఉండదు. కొత్త చట్టాల రూపకల్పన, వాటి డ్రాప్టింగ్, అందులో పొందుపరచాల్సిన అంశాలపై కలుగజేసుకొనే వెసులుబాటు మాత్రం వాళ్లకు ఉంటుందంటున్నారు కొందరు అధికారులు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు ఇప్పటికే దేశంలోని ఇతర రాష్టాల్లో పార్లమెంటరీ సెక్రెటరీల పని విధానాన్ని కొంతమేర అధ్యయనం చేసినట్లు సమాచారం. అన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తరవాత పరిపాలనా వ్యవహారాలకు సంబంధం లేకుండా, చట్టసభలకు అనుసంధానంగా పనిచేసే పార్లమెంటరీ సెక్రటరీల వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఇబ్బందులుండవనే అభిప్రాయానికి వచ్చారు. ఇందుకు అవసరం అయితే కొత్త చట్టానికి అనుగుణంగా అసెంబ్లీ బిజినెస్ రూల్స్ కూడా మార్చే దిశలో కసరత్తు జరగనుంది. ఇందుకు అసెంబ్లీ రూల్స్ కమిటీ సాయాన్ని ప్రభుత్వం కోరనుంది. మంత్రుల సంఖ్యకు సమానంగా అంటే 18 మంది కంటే ఎక్కువ కూడా పార్లమెంటరీ సెక్రటరీలను నియమించు కోవచ్చంటున్నారు. అవసరాన్ని బట్టి ముఖ్యమంత్రి దగ్గర ఒకళ్ళకంటే ఎక్కువగా పార్లమెంటరీ సెక్రెటరీస్ ఉండే విధంగా కూడా చట్టంలో వెసులుబాటు కల్పించనున్నట్లు సమాచారం. ఏదైనా కేబినేట్ విస్తరణ జరిగాక వీరి గురించి ఆలోచన చేసే అవకాశం ఉంది. ఈ నెలాఖరులోగా దీనిపై స్పష్టత రానుంది.




