. మంత్రి మల్లారెడ్డి అంటే దోపిడిదారులకు రక్ష… నమ్మిన ప్రజలకు శిక్ష…
కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) జూలై 27:– నమ్మి నానపోస్తే పుచ్చి బుర్రలాయే అన్న చందంగా.. గతంలో ఏ ఎమ్మెల్యే హయాంలో అనుభవించని నరకయాతన మంత్రి మల్లారెడ్డి నాలుగున్నర ఏళ్ల పాలనలో చవి చూసామని జవహర్ నగర్ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు మసిబూసి మారేడు కాయను చేసిన విధంగా కల్లబొల్లి కథలు అల్లి అరిచేతిలో స్వర్గాన్ని చూపించినట్లు చేసిన వాగ్దానాలను తుంగలో తొక్కి నాయకునిగా నమ్మి ఎమ్మెల్యేగా గెలిపించి తెలంగాణ రాష్ట్రానికి మంత్రి అయ్యే అవకాశాన్ని కల్పించిన ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏమాత్రం కృషి చేయకుండా నమ్మిన ప్రజలను నట్టేట్లో ముంచుతు మేలును మరిచి కీడును తలపెడుతున్నాడని జవహర్ నగర్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కళాశాల నిర్మాణం కాలగర్భానికేనా…? ఉన్నత విద్యను అభ్యసించేందుకోసం జవహర్ నగర్ యువత ఏలాంటి ఇబ్బందులకు గురికాకుండా జవహర్ నగర్ లో కళాశాల నిర్మాణం నా హయాంలో చేసి తీరుతానని ఎన్నో సభలు సమావేశాల్లో యువతను లోబర్చుకునే విధంగా ప్రసంగాలు చేసిన మంత్రి మల్లారెడ్డి, నాలుగున్నర ఏండ్ల పాలనలో కళాశాల నిర్మాణం ఎందుకు చేపట్టలేదని స్థానికులు నిలదీస్తున్నారు. 600 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మంత్రి మల్లారెడ్డి తన కాలేజీలకు యూనివర్సిటీ హోదాను కల్పించుకునేందుకోసం పడ్డ తపన జవహర్ నగర్ ప్రాంతంలో గల విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకోసం కళాశాల నిర్మాణం చేసేందుకు అంత తపన చూపకపోవడం లో ఆంతర్యం ఏమిటీ…? జవహర్ నగర్ ప్రజలు ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే పనికి వస్తారా…? జవహర్ నగర్ లో ప్రభుత్వ కళాశాల ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మంత్రి మల్లారెడ్డి పై లేదా …? మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా మా ఓట్లతో గెలిచి తెలంగాణ రాష్ట్రానికి మంత్రి అయింది తన వ్యాపారాలను వృద్ధి పరుచుకునేందుకేనా …? అని విద్యార్థుల తల్లిదండ్రులు అసహనానికి గురవుతున్నారు.
మంత్రి హోదాను అడ్డుపెట్టుకొని ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణం చేసిన సీ ఎం ఆర్ హాస్పిటల్ భవనాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి కేటాయిస్తారా…?జవహర్ నగర్ ప్రధాన రహదారి పక్కన ఉన్న కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని మంత్రిననే హోదాను జవహర్ నగర్ ప్రజలకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తాననే సాకును అడ్డు పెట్టుకొని హుందాగా విలువైన స్థలాన్ని కబ్జా చేసి చట్టానికి సవాల్ విసురుతూ నిబంధనలకు విరుద్ధంగా నేనే రాజు నేనే మంత్రి అన్నట్లుగా బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించి దానికి సీ ఎం ఆర్ హాస్పిటల్ అని పేరు పెట్టి ప్రారంభించి ఎందరికి ఉచిత వైద్య సేవలు అందించారనేది ప్రశ్నార్ధకంగా మారింది…? ఈ హాస్పిటల్ స్థలం ప్రభుత్వ స్థలం కాదా…? ఈ స్థలం ప్రభుత్వ స్థలం కానీ ఎడల ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం కానీయకుండా ఎలాంటి అక్రమాలకు తారతమ్య విభేదాలకు తావివ్వకుండా నిక్కచ్చిగా విధులు నిర్వహించిన గత తహసిల్దార్ గౌతం కుమార్ ఈ స్థలం ప్రభుత్వ స్థలమని ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించేవారు ఎవరైనా ఎంతటి వారైనా చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తూ సూచిక బోర్డును ఎలా ఏర్పాటు చేయడం జరిగింది…? అనంతరం ఒక సామాన్యుడు ఈ స్థలంలో భవన నిర్మాణం పనులు చేపట్టినప్పుడు ఈ ప్రభుత్వ స్థలాన్ని అన్యక్రాంతం కానీయకుండా ఏకంగా ఆర్ డి ఓ లచ్చిరెడ్డి జోక్యం చేసుకొని అక్రమ నిర్మాణం పేరుతో భవన నిర్మాణం పిల్లర్లను కూల్చి వేయడం జరిగింది… ఇంత తతంగం జరిగాక కోట్ల విలువ చేసే అతి విలువైన ఈ ప్రభుత్వ స్థలం పై మంత్రి మల్లారెడ్డి కన్ను వేసి తన హస్తగతం చేసుకోగానే ఈ ప్రభుత్వ స్థలం గ్రామ కంఠం స్థలంగా ఎలా మారింది మంత్రి మల్లారెడ్డి పెద్ద కోడలు పేరిట ఎలా రిజిస్ట్రేషన్ అయింది…? అనేది కీలకమైన అంశంగా మారింది… మంత్రికి ఒక న్యాయం… మామూలోడికి ఒక న్యాయమా…? ఈ స్థలం ప్రభుత్వ స్థలం అయినప్పటికీ మంత్రి అనే భయంతో గత గ్రామ పంచాయతీ అధికారులు రిజిస్ట్రేషన్ విషయంలో జోక్యం చేసుకొని పూర్తి సహాయ సహకారాలు అందించి పంచాయతీ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారా…? లేక గ్రామ కంఠం స్థలాన్ని రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలమని తహసిల్దార్ గౌతమ్ కుమార్ సూచిక బోర్డును ఏర్పాటు చేయగా… ఇందులో చేపట్టిన భవన నిర్మాణాన్ని అక్రమ నిర్మాణం పేరుతో కూల్చివేసి ఆర్ డి ఓ లచ్చిరెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారా…? అనే విషయం చర్చనీయాంశంగా మారింది ఈ భవన నిర్మాణం విషయంలో ప్రధాన అధికారులతో లోతుగా సమగ్ర విచారణ జరిపించి ఈ భవన నిర్మాణం ప్రభుత్వ భూమిలో వెలసిన అక్రమ భవన నిర్మాణం అని తేలినిచో ఈ భవనాన్ని జవహర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి కోసం కేటాయించాలని. ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమ మార్గంలో నిర్మించిన ఈ భవన నిర్మాణం పూర్తి వివరాలను ఆర్టిఐ సమాచారం ద్వారా తాము కూడా సేకరిస్తామని తెలిపారు. మంత్రి మల్లారెడ్డి వంద పడకల ఆసుపత్రి కోసం కేటాయించిన స్థలంలో ఆస్పత్రి భవన నిర్మాణానికి భూమి పూజ ఎందుకు చేయడం లేదు? జవహర్ నగర్ ప్రజలు నా గుండెకాయ లాంటి వారు అని గాంభీరమైన గలంతో సభలు సమావేషాల్లో అనునిత్యం చెప్పుకునే మంత్రి మల్లారెడ్డి గారడి మాటలను పక్కనపెట్టి వంద పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టి ఇచ్చిన హామీని నెరవేర్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. జవహర్ నగర్ ప్రాంతంలో నివాసముంటున్న మూడు లక్షల పైచిలుకు జనాభాకు ఆరోగ్య సౌలభ్య వసతి కోసం వంద పడకల ఆసుపత్రికి గాను అధికారికంగా కేటాయించిన స్థలం అక్రమార్కుల హస్తగతం కాకుండా ఆసుపత్రి భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని జవహర్ నగర్ ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి నాలుగున్నర సంవత్సరాల కాలం గడుస్తున్నప్పటికీ నేటి వరకు అనారోగ్య వంతులు గర్భిణీ స్త్రీల ఆరోగ్య సౌకర్యార్థం ఆసుపత్రి భవనం నిర్మాణం పనులను ప్రారంభించేందుకు సుముఖత చూపకపోవడం పట్ల ప్రజల నుండి భేదాభిప్రాయాలు వెలువడుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి ఇలాకాలోని జవహర్ నగర్ లో గతంలో నిండు శూలాలతో ఒక గర్భిణి స్త్రీ ప్రసవించేందుకు కోటి ఆశలతో జవహర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి. వైద్యులు పట్టించుకోక నిర్లక్ష్య ధోరణి అవలంబించడం వల్ల నిరాశ నిస్పృహకు గురై. ఇంటికి తిరిగి వెళుతూ పురిటి నొప్పులు అధికం కావడంతో నడి రోడ్డుపై ప్రసవించి పసికందుకు జన్మనిచ్చిన ఆ దీనురాలి పరిస్థితి మళ్లీ జవహర్ నగర్ లో ఎవరికి రావద్దు అనే మానవత్వంతో కూడిన ఆలోచన మంత్రి మల్లారెడ్డి లో ఏమాత్రం ఉన్నా ప్రజలు మల్లారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించినందుకు జవహర్ నగర్ లో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టి కృతజ్ఞత భావాన్ని చాటుకోవాలని జవహర్ నగర్ స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు బస్టాండు లేక ఇక్కట్లు పడుతున్న ప్రయాణికులు: ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం ప్రజల సొత్తును లక్షల్లో జీతాలుగా అనుభవిస్తున్న జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తూ వ్యవస్థలకు కలంకం తెచ్చి పెడుతున్నారని జవహర్ నగర్ ప్రజాసంఘాల నాయకులు స్థానికులు బగ్గుమంటున్నారు… ప్రధాన బస్టాండ్ వద్ద బస్సులు తిరగడానికి కూడా స్థలం లేకుండా ఏకంగా బస్టాండ్ స్థలాన్ని కబ్జా చేస్తూ విచ్చలవిడిగా నిర్మించిన అక్రమ షెడ్ల నిర్మాణాలను తొలగించకుండా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని ఆక్రమించడమే ఏకైక లక్ష్యంగా తాత్కాలిక రేకుల షెడ్ల నిర్మాణాలు ఏర్పాటు చేస్తూ అమాయకుల వద్ద లక్షలు కిరాయిల వసూలుకు పాల్పడుతుంటే ప్రభుత్వ భూమిని పరిరక్షించాల్సిన రెవెన్యూ యంత్రాంగం నిమ్మెకు నేర్పినట్లు వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారుతుంది. ఇటు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రయాణికుల సమస్యల పట్ల బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్న తీరు అటు రెవెన్యూ అధికారులు బస్సులు తిరగడానికి తావు లేకుండా చట్టానికి సవాల్ విసురుతూ నిర్మించిన రేకుల షెడ్ల నిర్మాణాలను తొలగించి ప్రభుత్వ భూమిని పరిరక్షించకపోవడంలో ఆంతర్యం ఏమిటి…? అక్రమార్కులతో అధికారులు కుమ్మక్కయ్యారా…? అక్రమార్కులు అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారా…? అధికారులే విధి నిర్వహణలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారా…? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి… ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా అధికారులు సక్రమంగా విధులు నిర్వహిస్తే 434 సర్వే నెంబర్ కు చెందిన ప్రభుత్వ స్థలంలో అక్రమ షెడ్లను నిర్మించిన అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా షెడ్ల నిర్మాణాలను పూర్తిస్థాయిలో తొలగించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అక్రమార్కులతో అధికారులు కుమ్మకై ప్రభుత్వం ఇచ్చే జీతాల కన్నా అక్రమార్కులు అందజేసే అధిక సంపాదనకు ఆసక్తి చూపుతూ అధికారులు విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని అనడానికి 434 సర్వే నెంబరుకు చెందిన ప్రభుత్వ స్థలములో వెలిసిన తాత్కాలిక షెడ్ల నిర్మాణాలు నిలువెత్తు నిదర్శనాలు కాదా…? ఇటు రెవెన్యూ అధికారులు అటు మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్లనే అక్రమార్కులు అక్రమ షెడ్ల నిర్మాణాలు చేపడుతూ పేట్రేగిపోతున్నారనీ ప్రజా సంఘాల నాయకులు ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా మంత్రి మల్లారెడ్డి ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఒక ఎమ్మెల్యేగా ప్రధాన బస్టాండు వద్దగల 434 సర్వే నెంబర్ కు చెందిన ప్రభుత్వ స్థలంలో వెలసిన అక్రమ షెడ్ల నిర్మాణాలను తొలగించి ఈ ప్రభుత్వ స్థలంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఒక బస్టాండ్ నిర్మాణంతో పాటు సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకున్నందుకు ఈ స్థలాన్ని కేటాయించాలని ప్రజా సంఘాల నాయకులు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేనియెడల నాలుగున్నర ఏండ్ల వ్యవధిలో విద్యా వైద్యం మౌలిక సదుపాయాల విషయంలో బాధ్యత రహితంగా వ్యవహరించినందుకు గృహ నిర్మాణాలకు అనుమతులు రద్దుచేసి జవహర్ నగర్ ప్రజలను మోసం చేసినందుకు జవహర్ నగర్ ప్రజలను ఓట్లు వేసే యంత్రాలుగా భావించి వ్యాపార సముదాయాలుగా వాడుకున్నందుకు రాబోయే ఎన్నికల్లో జవహర్ నగర్ ప్రజలకు తగు మూల్యం చెల్లించక తప్పదని ప్రజాసంఘాల నాయకులు స్థానికులు హెచ్చరిస్తున్నారు.