జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని ప్రభుత్వ ఆస్పత్రిని ఎంపీపీ కొండ శంకర్, జెడ్పీటీసీ తగరం సుమలతలు సందర్శించి రోగుల ఆరోగ్య పరిస్థితులు, వైద్య సేవలు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి సూపరిండెంట్ శ్రీనివాసరెడ్డితో సమావేశమై వైద్యుల వివరాలు, ప్రతి రోజు ఎంత మంది వైద్యులు విధులకు హజరవుతున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. నాలుగేండ్లుగా మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ప్రభుత్వ ఆస్పత్రిని పట్టించుకోవడం లేదని, పేదోడి ఆరోగ్యంపై శ్రద్ద చూపడంలేదన్నారు. ఆస్పత్రిలో వైద్యసేవలు, వసతుల గురించి ఏనాడు ఆలోచన చేయలేదని, కనీసం ఆస్పత్రి చైర్మన్‌గా సమీక్షలు నిర్వహించిన దాఖలాలు లేవన్నారు. కానీ గతంలో మంథని ఎమ్మెల్యేగా పుట్ట మధూకర్ ఉన్న సమయంలో ఆస్పత్రి చైర్మన్‌గా అనేక వసతులు కల్పించడంతో పాటు ఆధునిక వైద్యం అందుబాటులో వచ్చేలా కృషి చేశారన్నారు. ఆనాడు గర్బిణీలు, బాలింతలు, చిన్నారులు ఉక్కపోతలో ఉంటుంటే చలించిపోయి తన సొంత ఖర్చులతో ఏసీలు, కూలర్‌లు ఏర్పాటు చేయించారని ఆయన గుర్తు చేశారు. నిత్యం ఆస్పత్రికి ఆకస్మక తనిఖీలు చేస్తూ వైద్యాధికారులను అప్రమత్తం చేస్తూ పేదలకు మంచి వైద్యం అందించేలా కృషి చేశారన్నారు. ఆస్పత్రిలో ఎక్కువగా పేదోళ్ల వైద్యం పొందుతారని వారికి కనీస వసతులు కల్పించాలని ఆలోచన చేసిన పుట్ట మధూకర్‌కు పేదోడిపై ఉన్న ప్రేమ కన్పిస్తోందన్నారు. కానీ ఈనాడు ప్రస్తుత ఎమ్మెల్యే ఆస్పత్రిలో వసతులు కల్పించాలని వినతి పత్రాలు అందిస్తున్నారని, వినతులు ఇవ్వడం కాదు తన సొంత ఖర్చులతో వసతులు కల్పిస్తే బాగుంటుందని, ఇది ఎమ్మెల్యేగా ఆయన బాధ్యత అని అన్నారు. ప్రజల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయరాదని నిత్యం వైద్యులు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించాలని సూపరిండెంట్‌ను వారు సూచించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ ఎక్కటి అనంతరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, మాజీ వైస్ ఎంపీపీ వేల్పుల గట్టయ్య, రైతు సమితి మండల అధ్యక్షుడు ఆకుల కిరణ్, నాయకులు తగరం శంకర్‌లాల్, వీకే రవి, పాపారావు, రాధాకృష్ణ, సుల్తాన్ ఆసిఫ్‌ఖాన్‌తో పాటు తదితరులు ఉన్నారు.




