సర్కార్ స్కూల్ కు 6 లక్షల విరాళం
– కార్పొరేట్ స్కూల్ కు ధీటుగా వార్షికోత్సవ వేడుకలు
– ఆకట్టుకున్న దేశభక్తి గీతాలు
– వార్షికోత్సవంలో భద్రారెడ్డికి ఘనంగా సన్మానం…
(జనం సాక్షి ) ఝరాసంగం :
సమాజంలో చాలా మంది ధనవంతులు ఉన్నప్పటికీ దాన గుణ స్వభావం కొందరికే ఉంటుందని అటువంటి వ్యక్తులలో హైదరాబాద్ నిజాంపేట్ కు చెందిన ఆధ్యాత్మిక వేత కోలన్ భద్రారెడ్డి ముందు వరుసలో ఉన్నారని ఝరాసంగం, రాయికోడ్ సర్పంచుల ఫోరం అధ్యక్షులు జగదీశ్వర్, ప్రభాకర్ రెడ్డి, ఝరాసంగం విద్యాధికారి శ్రీనివాస్, బర్దిపూర్ గ్రామ సర్పంచ్ శివలక్ష్మి కృష్ణ పేర్కొన్నారు. మంగళవారం ఝరాసంగం మండలంలోని బర్దిపూర్ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా బర్దిపూర్ గ్రామాన్ని దత్తత గ్రామంగా తీసుకొని పాఠశాలకు రూ 6 లక్షల తో చిల్డ్రన్ పార్క్, విద్యార్థుల కోసం ప్రొజెక్టర్, బర్దిపూర్ గ్రామానికి ముఖద్వారం, ఆశ్రమానికి రాజగోపురం ఏర్పాటు చేసినందుకు గాను గ్రామస్తులు మర్యాదపూర్వకంగా శ్రీ హనుమాన్ మందిర్ నుండి భారీ కాన్వాయ్ తో భాజ భాజంత్రీల మధ్య టపాసులు పేలుస్తూ భద్రరెడ్డి ని ప్రాథమిక పాఠశాల వరకు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ముందుగా ఉపాధ్యాయులు, వివిధ గ్రామాల సర్పంచులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం గ్రామానికి సేవలందిస్తున్న ఆధ్యాత్మికవేత్త భద్రారెడ్డిని గ్రామస్తులు సర్పంచులు నాయకులు పూలమాల తో ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా సాంస్కృతిక కార్యక్రమాలు గ్రామస్తులను వివిధ గ్రామాల నుండి వచ్చిన ఉపాధ్యాయులను మంత్రముగ్ధుల్ని చేశాయి. ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవం వేడుకలు వైభవంగా నిర్వహించడంతో వివిధ మండలాల నుండి వచ్చిన అధికారులు ఉపాధ్యాయులు, కార్యక్రమాన్ని నిర్వహణ చేసిన బర్దిపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జీవన్ రావు, సంగారెడ్డి శ్రీనివాసులను అభినందించారు. గ్రామస్తులు అందరికీ సభ అనంతరం విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు.




