భద్రాచలం పర్యటన అనంతరం సీఎం కేసీఆర్ హెలీకాప్టర్లో ఏటూరునాగారం దిశగా ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి విపత్తుతో జలమయమై, ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిని పరిశీలించారు. నదికి ఇరువైపులా వరదల్లో చిక్కుకున్న గ్రామాల్లో వరద పరిస్థితిని పరిశీలిస్తూ సీఎం ఏటూరునాగారంలోని రామన్నగూడెం చేరుకున్నారు. రాష్ట్ర మహిళా, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సీఎం కేసీఆర్ కు స్వాగతం పలికారు. వరద ప్రవాహం తగ్గాలని గోదావరికి తల్లికి సీఎం కేసీఆర్ సారె సమర్పించి, శాంతి పూజలు నిర్వహించారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులతో కలిసి గోదావరి వరద తాకిడికి గురైన కరకట్టను సీఎం కేసీఆర్ పరిశీలించారు. వరద ముంపు ప్రాంతాల బాధితులను పరామర్శించి, అక్కడి పరిస్థితులపై వారిని అడిగి తెలుసుకున్నారు. అధికారుల నుంచి వారికి అందుతున్న సహకారం, పునరావాస ఏర్పాట్లపై ఆరా తీశారు. మంత్రులు ప్రజాప్రతినిధులు, అధికారులతో కేసీఆర్ ఐటీడీఏ గెస్ట్ హౌస్ లో మరి కాసేపట్లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.




