హైదరాబాద్ : నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురం – చిన్నకోడూరు మధ్య శనివారం పోలీసులకు, ముష్కరులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఎస్ఐ జూలూరి సిద్ధయ్య(29) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలోని వెంటిలేటర్‌పై సిద్ధయ్యకు చికిత్స అందిస్తున్నారు.
ఆయన శరీరంలోకి నాలుగు బుల్లెట్లు దూసుకపోయాయి. అందులో మూడింటిని తొలగించగా నాలుగో బుల్లెట్ తలలో ఉండిపోయింది. సిద్ధయ్య ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడిన తర్వాత మరోసారి శస్త్రచికిత్స చేసి బుల్లెట్ ను తొలగించాలని వైద్యులు యోచిస్తున్నట్లు సమాచారం. మరో 24గంటలు గడిస్తే కాని సిద్ధయ్య ఆరోగ్య పరిస్థితి ఏమి చెప్పలేమని వైద్యులు పేర్కొంటున్నట్లు సమాచారం. పది మంది వైద్యుల బృందం ఇప్పటి వరకు సిద్ధయ్యకు మూడు శస్త్రచికిత్సలు చేసింది.




