జనంసాక్షి, మంథని :మహిళల సంక్షేమం, అభివృద్ధిపై నాడు – నేడు ఉన్న పని తీరును, పరిస్థితులను బేరీజు వేసుకోవాలని, ప్రస్తుతం అమలవుతున్న పథకాల తీరును గమనించాలని జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. మంగళవారం మంథని లోని ఎస్.ఎల్.బీ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ, భూపాలపల్లి జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ జక్కుల శ్రీహర్షినితో కలిసి పాల్గొన్నారు. తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం సందర్భంగా విచ్చేసిన జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్, జిల్లా కలెక్టర్ ను మహిళలు బతుకమ్మలు, బోనాలతో ఘనంగా స్వాగతించారు. మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాళ్లను పరిశీలించిన జడ్పీ చైర్మన్, జిల్లా కలెక్టర్ గర్భిణీగా ఉన్న మహిళలకు సీమంతం చేసి, చిన్న పిల్లలకు అన్నప్రాశన జరిపించారు. అనంతరం తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం వేడుకలను జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్, జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ మాట్లాడుతూ.. మహిళా సంక్షేమం కోసం గత ప్రభుత్వం అనుసరించిన విధానాలు, ప్రస్తుతం అమలవుతున్న పథకాలను బేరీజు వేసుకోవాలని అన్నారు. గత ప్రభుత్వాల హయంలో అంగన్వాడి కేంద్రాల్లో కనీస సౌకర్యాలు ఉండేవి కాదని, 54 శాతం మాత్రమే బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం లభించేదని జడ్పీ చైర్మన్ తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలలో సింగరేణి, సిఎస్ఆర్ నిధులతో మౌళిక సదుపాయాలు కల్పించడం జరిగిందని, గతంలో నెలకు అంగన్వాడి వర్కర్లకు 4 వేల 200, అంగన్ వాడి ఆయాలకు 2 వేల 200 జీతం అందిస్తే నేడు అంగన్వాడీ వర్కర్లకు 13 వేల 650 , అంగన్ వాడి ఆయాలకు 7 వేల 800 జీతం అందిస్తున్నా మని తెలిపారు. దేశంలోనే అంగన్వాడి కార్యకర్తలకు అత్యధిక జీతాలు చెల్లిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు. పేద మహిళలకు అంగన్వాడీ కేంద్రాలలో శ్రీమంతం జరిపిస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని, మహిళలు అన్ని రంగాలలో ముందు ఉండాలనే ఉద్దేశంతో గతంలో లేనివిధంగా స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం, మార్కెట్ కమిటీలలో, పోలీస్ నియామకాలలో 33 శాతం రిజర్వేషన్ ను సీఎం కేసీఆర్ కల్పించారని జడ్పీ చైర్మన్ పేర్కొన్నారు. ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంతో పాటు, పిల్లలకు బాలామృతం అందిస్తూ వారి ఎదుగుదలలో ఇబ్బందులు లేకుండా పకడ్బందీ కార్యాచరణ అమలు చేస్తున్నామని అన్నారు. కెసిఆర్ కిట్ పథకం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు గణనీయంగా పెరిగాయని, పేద మహిళలకు మగ పిల్లవాడు పుడితే 12 వేలు, ఆడపిల్ల పుడితే 13 వేలు సహాయం అందిస్తూ 16 వస్తువులతో కూడిన కిట్ ను అందిస్తున్నామని అన్నారు.
వ్యవసాయం పట్ల చదువుకున్న యువత ఆసక్తి చూపకపోవడం కొంత విచారకరమని, ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు కోసం పరితపిస్తూ దగ్గర్లో ఉన్న ఉపాధి అవకాశాలను విడిచి పెడుతున్నారని జెడ్పీ చైర్మన్ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం చేసే యువకులకు వివాహానికి పిల్లలు ఇవ్వకపోవడం దురదృష్టకరమని, ఈ పద్ధతి మారాలని జడ్పీ చైర్మన్ తెలిపారు.ప్రస్తుతం యువకులు చదివే చదువులలో నాణ్యత చాలా వరకు లోపించిందని, సెల్ ఫోన్ల కారణంగా చిన్నపిల్లల నుంచి తప్పుడు దారులు పడుతున్నారని, మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేదాని పై మహిళలు నిఘా పెట్టాలని, పిల్లల చదువు పై శ్రద్ధ వహించాలని, నాణ్యమైన విద్య పిల్లలకు అందేలా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ , ప్రజాప్రతినిధులు, సి.డి.పి. ఓ. తోట పద్మశ్రీ,, అధికారులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
మహిళల అభివృద్ధిపై నాడు – నేడు పని తీరును బేరీజు వేసుకొవాలి – తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం వేడుకలలో జడ్పీ చైర్మన్ పుట్ట మధు




