చట్టబద్ధతతోపాటు నిబద్ధత అవసరం : హరీష్రావు
హైదరాబాద్ : ఎస్సీ,ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లులో కొన్ని లోపాలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి నేత హరీష్రావు అన్నారు. గతంలో జరిగిన తప్పులు మళ్లీ జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లులో శాసనసభలో చర్చ సందర్భంగా తెరాస పార్టీ తరపున హరీష్రావు మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చి 65 ఏళ్లైనా దళిత, గిరిజనుల బతుకులు మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోకాంగ్రెస్ ప్రభుత్వంలో 5 కమిటీలు వేసి వదిలేశారని గుర్తుచేశారు. ఉప ప్రణాళికకు చట్టబద్ధతతోపాటు ప్రభుత్వానికి నిబద్ధత కూడా అవసరమేనని అన్నారు. వసతి గృహాల విద్యార్థులకు రూ. 16.80తో మూడుపూటల భోజనం సాధ్యమా? అని ప్రశ్నించారు. ఉప ప్రణాళిక బిల్లులో కొన్ని లోపాలు ఉన్నాయని వాటికి సవరణలను ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. దారిమళ్లిన రూ.21 వేల కోట్లను సమీకరించి దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ,ఎస్టీ నోడల్ ఏజెన్సీ ద్వారా ఉప ప్రణాళికపై ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలని కోరారు. కాలపరిమితి లేకుండా ఉప ప్రణాళిక చట్టం అమలు చేయాలని సూచించారు. ఉపాధి హామీలో ఉన్నట్లు ఉప ప్రణాళికలోకూడా సామాజిక తనిఖీ ఉండాలని అబుడ్మెన్ను నియమించాలని పేర్కొన్నారు.



