బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం, రాస్తారోకో
చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
బండి సంజయ్ కు మతిభ్రమించింది
భారాస పార్టీ మానకొండూరు మండలాధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్
మానకొండూరు, ఆర్ సి, మార్చి 11( జనం సాక్షి)
ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత పై బీజేపీ తెలంగాణ స్టేట్ చీఫ్ బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై భారత్ రాష్ట్ర సమితి పార్టీ శ్రేణులు మండిపడ్డాయి. శనివారం కరీంనగర్, వరంగల్ రహదారిపై ధర్నా చేసి, బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేసి తమ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సంజయ్ డౌన్ డౌన్, బిజెపి డౌన్ డౌన్, అంటూ ప్రధాన రహదారిపై నినాదాలు రాస్తారోకో చేస్తూ ఆందోళన చేపట్టారు. సంజయ్ పై తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులు ముక్తకంఠంతో నినదించాయి. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్ సంజయ్ వ్యాఖ్యల పట్ల తమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతగల ఎంపీ హోదాలో ఉండి, సభ్య సమాజం తలదించుకునే విధంగా కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. మహిళల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం సబబు కాదని హితువు పలికారు. భాజపా లో బండి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో పార్టీ అధోగతి పాలవుతుందని హెచ్చరించారు. వెంటనే తన వ్యాఖ్యలను బే షరతుగా ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మానకొండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
రామంచ గోపాల్ రెడ్డి, పిట్టల మధు, శాతరాజు యాదగిరి, నెల్లి మురళి, ఉండింటి శామ్సన్, ఎరుకల శ్రీనివాస్ గౌడ్, పార్నంది కిషన్, నెల్లి శంకర్, పిండి సందీప్ తదితరులు ధర్నా, రాస్తారోకో కార్యక్రమానికి హజరయ్యారు.




