Tuesday, 3 November 2026

మారథాన్‌ సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌ సిటీ:ఆదివారం జరిగే మారథాన్‌ సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నామని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సి.వి.ఆనంద్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆంక్షలు ఆ రోజు ఉదయం 5 నుంచి 10 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు. మియాపూర్‌, మాదాపూర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో భారీ వాహనాలు, వాటర్‌ట్యాంకర్లు, ట్రక్కుల ప్రవేశాన్ని నిషేధించారు. హైదరాబాద్‌ మారథాన్‌ పేరిట 42…21…10 కిలోమీటర్ల పరుగు పోటీలు నిర్వహించనున్నారు. హుస్సేన్‌సాగర్‌ తీరాన మారథాన్‌ ప్రారంభమవుతుంది. ఇందులో పాల్గొన్న క్రీడాకారులు, యువతీ యువకులు అక్కడ నుంచి సోమాజిగూడ, పంజాగుట్ట, బంజారాహిల్స్‌, కె.బి.ఆర్‌.పార్కు, జూబ్లీహిల్స్‌ చేరతారు. అనంతరం సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ పరిధిలోని కావూరిహిల్స్‌లోకి ప్రవేశిస్తారు. మాదాపూర్‌, విఠల్‌నగర్‌, సైబర్‌ టవర్స్‌ ఎడమవైపు ద్వారా సైబర్‌గేట్‌వే, మైండ్‌స్పేస్‌, పాత ముంబయ్‌ రహదారి మీదుగా గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ చేరతారు. అక్కడి నుంచి ఐఐఐటీ పక్క నుంచి గోపీచంద్‌ అకాడమీ, ఐఎస్‌బీ వరకూ వెళతారు. ఐఎస్‌బీ వద్ద నుంచి వ్యతిరేక మార్గంలో విప్రో జంక్షన్‌ నుంచి పొలారిస్‌, క్యూ సిటీ, గౌలిగూడ గ్రామం, గోపనపల్లి తండా మీదుగా హైదరాబాద్‌ సెంట్రల్‌యూనివర్సిటీ గేట్‌ వద్దకు వెళతారు. అక్కడ నుంచి ఎడమవైపు మార్గం ద్వారా గచ్చిబౌలి వీఐపీ మార్గం నుంచి స్టేడియంలోకి వెళతాడరు. ఈ మార్గం ద్వారా ప్రయాణించే వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేశారు. అత్యవసర వాహనాలు, విమానాశ్రయం, రైల్వేస్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులు టికెట్‌ చూపించి ఆ మార్గం ద్వారా వెళ్లవచ్చని సీపీ సూచించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *