జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని కమాన్ పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి రాజలింగు తెలిపారు. శుక్రవారం కమాన్ పూర్ లోని ఏఎంసీ కార్యాలయంలో నూతన పాలకవర్గ తొలి సర్వసభ్య సమావేశాన్ని చైర్మన్ దాసరి రాజలింగు అధ్యక్షతన ఏఎంసీ కార్యదర్శి సురేందర్ నిర్వహించారు. కమాన్పూర్ మార్కెట్ కమిటీలో 5 కోట్ల 35 లక్షలు నిధులు నిల్వ ఉన్నాయని.. ఈ నిధులతో మార్కెట్ యార్డ్, గోదాముల నిర్మాణానికి ప్రభుత్వ అనుమతితో వాడుకోవచ్చు అన్నారు. అయితే కమాన్ పూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ స్థలాలు లేకపోవడం పెద్ద సమస్యగా మారిందని, చుట్టూ ప్రక్కల గ్రామాల్లో మార్కెట్ యార్డుకు అనువైన స్థలాన్ని గుర్తించి ప్రభుత్వ అనుమతులు తీసుకొని జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ సహకారంతో మార్కెట్ యార్డ్ ఏర్పాటుకు పూనుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అనంతరం ఏఎంసీ చైర్మన్ దాసరి రాజలింగు తో పాటు వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మీ మల్లు, డైరెక్టర్లను కమాన్ పూర్ సింగల్ విండో చైర్మన్ ఇనుగంటి భాస్కరరావు శాల్వాలతో ఘనంగా సన్మానించారు.
మార్కెట్ యార్డ్ ఏర్పాటుకు కృషి చేస్తా..! – కమాన్ పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి రాజలింగు




