
హైదరాబాద్: సినీ కళాకారుల సంఘం.. ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో సినీనటుడు రాజేంద్రప్రసాద్ ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి జయసుధపై 85 ఓట్ల ఆధిక్యంతో రాజేంద్రప్రసాద్ గెలుపొందారు. మా అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 702 ఓట్లకు గాను 394 ఓట్లు పోలయ్యాయి. రాజేంద్రప్రసాద్‌కు 237 ఓట్లు రాగా, జయసుధకు 152 ఓట్లు, బొమ్మరిల్లు ధూళిపాళ్లకు 5 ఓట్లు పోలయ్యాయి. రాజేంద్రప్రసాద్ 85 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందినట్లు’మా’ పూర్వ అధ్యక్షుడు మురళీమోహన్ ప్రకటించారు. రాజేంద్రప్రసాద్ ప్యానెల్ నుంచి శివాజీరాజా, ఉత్తేజ్, కాదంబరి కిరణ్‌లు కూడా గెలుపొందారు. రాజేంద్ర ప్రసాద్ ప్యానెల్ ఘన విజయం సాధించడంతో ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఆయన వర్గీయులు సంబరాలు చేసుకున్నారు.
‘మా’ విజయం తెలుగు ప్రజలకు అంకితం: రాజేంద్రప్రసాద్
హైదరాబాద్: ప్రపంచంలోని ప్రతి తెలుగువారు ఈ క్షణం కోసం ఉత్కంఠగా ఎదురు చూశారని ‘మా’ అధ్యక్షుడిగా విజయం సాధించిన రాజేంద్రప్రసాద్ అన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలను గుర్తు చేశారు. చాలా పరీక్షలు దాటుకుని ఈ ఎన్నికల్లో విజయం సాధించామన్నారు. ‘ఈ క్షణం నుంచి అధ్యక్షుడిగా ఉన్నంత కాలం మా అసోసియేషన్ డబ్బులతో నేను టీ కూడా తీసుకోను’ అని ప్రకటించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని తెలిపారు. సినిమా కళాకారులందరూ నవ్వుతూ బతకాలన్నదే తన కోరిక అని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో కళాకారుల సంక్షేమానికి కృషి చేయనున్నట్లు చెప్పారు. ఈ విజయాన్ని తెలుగు ప్రజలకు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. తన విజయాన్ని కోరుకున్న అందరికీ రాజేంద్రప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. సినీనటులు శివాజీరాజా, కాదంబరి కిరణ్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
రెండు నెలల ఉత్కంఠకు తెర
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో గత రెండు నెలలుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. గత నెల 29న జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం ఎన్నడూ లేని విధంగా సహజనటి జయసుధ, నటకిరీటి రాజేంద్రప్రసాద్ పోటీ పడ్డారు. ఇరువురి ప్యానెళ్ల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు సాగాయి. పేద కళాకారుల కోసం ఒకరిని మించి ఒకరు హామీల వర్షం కురిపించారు. ఈ క్రమంలో ‘మా’ ఎన్నికలు చట్టవిరుద్ధంగా జరుగుతున్నాయంటూ నటుడు కల్యాణ్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఎన్నికలు నిర్వహించుకోవచ్చని … ఫలితాలను నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు జరగ్గా మొత్తం 702 మంది సభ్యుల్లో కేవలం 394 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల ప్రక్రియనంతా చిత్రీకరించిన ఎన్నికల అధికారులు ఆ సీడీలను కోర్టుకు సమర్పించారు. ‘మా’ ఎన్నికలపై ఇరువర్గాల వాదనలు విన్న సివిల్ న్యాయస్థానం కల్యాణ్ ఫిర్యాదును కొట్టివేసింది. దీంతో ‘మా’ అధ్యక్ష ఫలితాల వెల్లడికి మార్గం సుగమం కావడంతో ఎన్నికల అధికారులు ఇవాళ ఫిల్మ్ చాంబర్‌లో ఓట్ల లెక్కింపు పూర్తి చేశారు. ఉత్కంఠగా సాగిన ఎన్నికల్లో ‘మా’ అధ్యక్ష పీఠం రాజేంద్రప్రసాద్‌ను వరించింది.
‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్ ఘన విజయం




