హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ ఆలస్యంపై హైకోర్టు మరోసారి ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఎన్నికలను మీరు నిర్వహిస్తారా..? లేక మమ్మల్నే జోక్యం చేసుకొమ్మంటారా..? అంటూ హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. సోమవారంలోగా ఎన్నికల నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని అడ్వకేట్ జనరల్‌ను కోర్టు ఆదేశించింది.
జీహెచ్‌ఎంసీ ఎలక్షన్స్‌పై వీడని ఉత్కంఠ..
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై ఉత్కంఠ కొసాగుతూనే ఉంది. ఎన్ని రోజుల్లో ఎన్నికలను నిర్వహిస్తారో ఇంకా స్పష్టత లేదు. తెలంగాణ ప్రభుత్వం 249 రోజులు కావాలని నెలరోజుల క్రితం కోర్టుకు ఆఫిడవిట్ సమర్పించింది. అంతకాలం ఇవ్వడం కుదరదన్న హైకోర్టు.. మరికొన్ని రోజుల తక్కువ సమయంతో రావాలని గతంలో ఉన్నత న్యాయస్థానం సూచించింది.
ఎన్నికల నిర్వహణపై హైకోర్టు సీరియస్..
జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణను ఆలస్యం చేయడం పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికలను మీరు నిర్వహిస్తారా..? లేదా మమ్మల్ని జోక్యం చేసుకొమ్మంటారా..? అని ప్రశ్నించింది. ఒకవేళ మీరు నిర్వహించలేకపోతే.. తామే కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తామని తెలిపింది. దాంతో ఇది రాష్ర్ట ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందని అడ్వకేట్ జనరల్ చెప్పారు. ఎన్నికల నిర్వహణకు ఆరు నెలల గడువు కోరారు. కానీ, అంత గడువు అవసరమా లేదా అన్న విషయాన్ని సోమవారం తేలుస్తామని కోర్టు తెలిపింది.
ఎన్నికల నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని ఆదేశం..
ప్రస్తుతమున్న 150 డివిజన్లను 200కు పెంచుతున్నట్లు జీహెచ్‌ఎంసీ తరపున హాజరైన న్యాయవాది తెలిపారు. నవంబర్ వరకూ సమయం కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. పదే పదే ఇలా గడువు కోరుతున్నారని, ఇది చట్టానికి లోబడి ఉందా లేక మీరే లెక్కలు వేసుకుని చెబుతున్నారా అని ప్రశ్నించింది.
మొత్తానికి జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ ప్రకియ అలస్యంతో ఉన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల షెడ్యూల్‌ను హైకోర్టే డిసైడ్ చేసేటట్లుగా పరిస్ధితి కనపడుతోంది.
గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్..ఉత్కంఠ తొలగేనా..?




