హైదరాబాద్: సభ నుంచి తమను సస్పెండ్ చేసిన విషయంపై పునః పరిశీలించాలని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పీకర్ సిరికొండ మధుసూదనాచారికి లేఖ రాశారు. తమను ఏకపక్షంగా సభ నుంచి సస్పెండ్ చేశారని లేఖలో ప్రస్తావించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమపై సభలో దౌర్జన్యం చేశారన్నారు. జాతీయ గీతం నెపంతో సస్పెండ్ చేయడం దురదృష్టకరమన్నారు. జాతీయ గీతంపై తమకు ఎంతో గౌరవం ఉందని, ఆ అంశంపై క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. అసెంబ్లీని స్పీకర్ నడుపుతున్నారో లేక మంత్రి హరీష్‌రావు నడుపుతున్నారో అర్థం కావడం లేదన్నారు. క్షమాపణ విషయం స్పీకర్ తమను అడగనే లేదన్నారు. తమ ఎమ్మెల్యేలను కొట్టిన దృశ్యాలు సీడీల్లో లేకుండా చేయడం వెనుక హరీష్ రావు హస్తం ఉందని ఆరోపించారు. అసెంబ్లీ లైవ్ కాంట్రాక్ట్ కూడా హరీష్‌రావు బంధువుదేనని తెలిపారు. రేపు అసెంబ్లీ నుంచి రాజ్‌భవన్ వరకు పాదయాత్ర చేయనున్నట్టు ఎర్రబెల్లి పేర్కొన్నారు.




