మిషన్‌ కాకతీయ పనుల్లో ఉమ్మడి జిల్లా ముందంజ

కొత్తగూడెం,జూన్‌15(జనంసాక్షి): మిషన్‌ కాకతీయ పథకంలో ఉమ్మడి జిల్లాలో పనులు నిర్వహణలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచాయని అధికారులు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాలుగు విడతల్లో 2850 చెరువులు మంజూరు కాగా వాటికి రూ.849 కోట్లు నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. నాలుగు విడతల్లో నిర్వహించిన పనుల్లో ఇప్పటివరకు 2100 చెరువుల పనులు పూర్తి అయ్యాయని అన్నారు. అందుకు పాల్వంచ సవిూపంలోని రాళ్లవాగు ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ. 50 కోట్లు మంజూరు చేసిందని, ఈ ప్రాజెక్టు కింద 1500 ఎకరాల ఆయకట్టు ఉందని తెలిపారు. ఉమ్మడి జిల్లాల్లో ట్రిపుల్‌ఆర్‌ పథకం కింద రూ. 79 కోట్ల నిధులతో 56 పనులు నిర్వహించాల్సి ఉండగా 28 పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. 9 మినీ ట్యాంక్‌ బండ్‌ చెరువులకు గాను ఒకటి పూర్తి కాగా 7 పోగ్రస్‌లో ఉన్నాయన్నారు. మరో దానికి టెండర్‌ నిర్వహించాల్సి ఉందని వివరించారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం సవిూపంలోని పిండిప్రోలు చెక్‌డ్యామ్‌ నిర్మాణానికి రూ. 10 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని మొత్తం మిషన్‌ కాకతీయ పనులు నాలుగు దశల్లో మంజూరైన చెరువుల పనులు చాలా వరకు పూర్తవగా మిగిలిన చెరువుల పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. అదేవిధంగా రెండు జిల్లాల్లో ఆక్రమణకు గురైన చెరువులను 523 గుర్తించి ఇప్పటివరకు 135 ఎకరాలను స్వాధీనం చేసున్నామన్నారు. అందులో లకారం చెరులో 9 ఎకరాలు గుర్తించి ఆక్రమణలు తొలగించి స్వాధీనం చేసుకోవటం జరిగిందని అన్నారు. అశ్వారావుపేట దొంతికుంట మిగిలిన చెరువు పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. దబ్బతోగు కెనాల్‌ పనులు పూర్తి దశకు చేరుకున్నాయని రైతులకు చెల్లించాల్సిన రూ.79 లక్షలు పే అండ్‌ ఎకౌంట్‌లో సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. మిషన్‌ కాకతీయ 4వ విడత చెరువుల పనులను ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలస్తున్నారు.పనుల నాణ్యత ప్రమాణాలపై అధికారులతో చర్చించారు. చెరువు పనులు అన్ని చోట్ల నాణ్యతా ప్రమాణాలతో నిర్మిస్తున్నారని స్థానికుల సహాయ సహకారాలతో అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు.

——