Friday, 6 November 2026

రంజాన్‌ పండగ శనివారమే

దేశవ్యాప్తంగా మతపెద్దల ఏకాభిప్రాయం

హైదరాబాద్‌,జూన్‌15(జ‌నం సాక్షి): రంజాన్‌ పండుగ భారత్‌లో శనివారం జరుగనుంది. తెలంగాణలో కూడా శనివారం జరపాలని మతపెద్దలు నిర్ణయించారు. పండగ నిర్ధారణకు హేతువైన నెలవంక దర్శనమివ్వకపోవడంతో శనివారం ఈదుల్‌ ఫితర్‌కు సిద్దం అయ్యారు. జూన్‌ 16, శనివారం రోజున పండుగను జరుపుకోవాలని నిర్ణయించారు. షవ్వాల్‌ నెల చంద్రవంక గురువారం కనిపించలేదని దీంతో ఈదుల్‌ ఫిత్‌ (రంజాన్‌ పండుగ) 16న జరుపాలని మతపెద్దలు తీర్మానించారు. మొదట శుక్రవారం పండుగ జరుగుతుందని ముస్లింలు భావించారు. ఈ మేరకు ఏర్పా ట్లు చేసుకున్నారు. అయితే చంద్రుడు కనిపించకపోవడంతో మరోరోజు ఉపవాస దీక్షకు ఉపక్రమిస్తున్నారు. తెలంగాణలో రంజాన్‌ పండుగపై అధికారిక ప్రకటన చేసే ముస్లిం ఉలేమాలు, ముఫ్తీలతో కూడిన రుహితే హిలాల్‌ కమిటీ గురువారం ఇక్కడి మోజంజాహి మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో సమావేశమైంది. వివిధ ప్రాంతాల నుంచి చంద్రవంకకుసంబంధించి సమాచారం సేకరించారు. సూర్యుడు అస్తమించిన తరువాత రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, పొరుగు రాష్ట్రాలకు చెందిన పలు ప్రాంతాల నుంచి ముస్లింలు ఫోన్లు చేసి తమకు కూడా చంద్రుడు కనిపించలేదని కమిటీకి తెలిపారు. ఈ విషయాన్ని ధ్రువీకరించుకున్న తరువాత కమిటీ అధ్యక్షుడు ఖుబూల్‌ పాషా షుత్తారీ, సభ్యుడు ముఫ్తీఖలీల్‌ అహ్మద్‌ విూడియాతో మా ట్లాడుతూ.. రంజాన్‌ పండుగ జూన్‌ 16న జరుగుతుందని అధికారికంగా ప్రకటించారు. షవ్వాల్‌ చంద్రుడు కనిపించనందున శుక్రవారం ముస్లింలు యథావిధిగా తమ 30వ ఉపవాసదీక్షను పాటించాలని తెలిపారు. ఈ సమావేశం అనంతరం వక్ఫ్‌బోర్డు అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించారు.సౌదీఅరేబియా, దుబాయ్‌ తదితర గల్ఫ్‌దేశాల్లో శుక్రవారం 15వ తేదీ రంజాన్‌ పండుగ జరుపుకోవాలని ఆ దేశాల్లో అధికారిక ప్రకటనలు వెలువడ్డాయి. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ లో కనిపినించినట్టు చెప్తున్న చంద్రవంక ఫొటో సోషల్‌ విూడియాలో వైరల్‌ అయ్యింది. ఆస్టేల్రియాలో ఈ నెల 16నే రంజాన్‌ పండుగ జరుగుతుందని మూన్‌ సైటింగ్‌ ఆస్టేల్రియా కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ షబ్బీర్‌ అహ్మద్‌ తెలిపారు.