మిషన్ భగీరథతో సకాలంలో నీరు
కోటి రూపాయల విద్యుత్తు బిల్లు ఆదా
మహబూబ్‌నగర్,అక్టోబర్4(జనంసాక్షి): మిషన్ భగీరథ పథకం అమలుతో పాలమూరు పురపాలక సంఘానికి నెలకు కోటి మేర విద్యుత్తు బిల్లులు ఆదా అవుతాయి. ప్రస్తుతం పట్టణానికి రామన్‌పాడ్, కోయిలసాగర్ పథకాల ద్వారా నీళ్లు సరఫరా అవుతున్నాయి. పట్టణానికి 65 కిలోవిూటర్ల దూరంలో ఉన్న రామన్‌పాడు నుంచి నాలుగు జలాశయాల గుండా నీళ్లు సరఫరా చేస్తుండడంతో నెలకు రూ.35 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు బిల్లులు వస్తున్నాయి. అలాగే 30 కిలోవిూటర్ల దూరం నుంచి రెండు రిజర్వాయర్ల ద్వారా కోయిల్‌సాగర్ నీరు సరఫరా అవుతుండడంతోనూ రూ.40 లక్షల మేర నెలకు విద్యుత్తు బిల్లులు వస్తున్నాయి. మిషన్ భగీరథ అమలుతో ఈ విద్యుత్ బిల్లుల భారం నుంచి పురపాలిక గ్టటెక్కుతుంది. అలాగే ఎన్నో ఏళ్ల తాగునీటి ఇబ్బందులు మిషన్ భగీరథతో తొలుగుతాయి. పట్టణంలో నీటి సరఫరా వ్యవస్థ మొత్తంగా
ఆధునికీకరిస్తారు.14 ట్యాంకులు నిర్మించి వాటికి 300 కిలోవిూటర్ల పొడవునా పైపులైన్లు అనుసంధానం చేస్తాం. త్వరలో పనులు మొదలవుతాయి. మిషన్ భగీరథతో పురపాలికకు రామన్‌పాడ్, కోయిల్‌సాగర్ నీటి సరఫరా పథకాల ద్వారా నెలకు వచ్చే విద్యుత్ బిల్లుల భారం పూర్తిగా తగ్గుతుంది. గ్రావిూణ నీటి సరఫరాలశాఖ పర్యవేక్షణలో ఇక నుంచి నీటి సరఫరా జరుగుతుంది. మొత్తంగా పాలమూరు పురపాలికలో తాగునీటి కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాతో అమృత్ పథకం కింద పాలమూరు పురపాలక సంఘానికి మంజూరు చేసిన రూ.160 కోట్లతో అమలు చేయబోతున్న మిషన్ భగీరథ నీటి సరఫరా పనుల టెండరు ఎట్టకేలకు పూర్తయింది. ఈ పనులను మెగా కంపెనీ గుత్తేదారులు సొంతం చేసుకున్నారు. దీంతో పట్టణంలో తాగునీటి పైపులైన్ల విస్తరణ, జలాశయాల నిర్మాణం వంటి పనులు చేపట్టబోతున్నారు. ఏడాది కాలంలో ఈ పనులు పూర్తి చేసి ప్రజలకు శుద్ధజలం సరఫరా చేసేందుకు పనులను త్వరగా పూర్తి చేయనున్నారు. సకాలంలో పనులు పూర్తి చేస్తే ప్రభుత్వం హావిూ ఇచ్చినట్లు పాలమూరు పట్టణ ప్రజలకు రోజూ నల్లానీరు అందే అవకాశం ఏర్పడుతుంది. పాలమూరు పట్టణంలో మిషన్ భగీరథ ద్వారా తాగునీటి పథకాన్ని ఆధునికీకరించడంతోపాటు పట్టణ జనాభాకు అనుగుణంగా మరో 20 ఏళ్ల పాటు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పైపులైన్లు విస్తరించి రిజర్వాయర్లు నిర్మిస్తారు. మిషన్ భగీరథ ద్వారా పట్టణానికి అప్పన్నపల్లి వైపు నుంచి వచ్చే ప్రధాన పైపులైన్ నుంచి అయ్యప్పకొండపై నిర్మించే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా రోజూ 20 ఎమ్మెల్డీలు, అలాగే భూత్పూర్ వైపు నుంచి వచ్చే ప్రధాన పైపులైన్ నుంచి మన్యంకొండపై నిర్మిస్తున్న బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా రాంరెడ్డిగూడెం ఫిల్టర్‌బెడ్‌తో అనుసంధానం చేస్తూ నీరు సరఫరా చేస్తారు.