సిఎల్ పి నేత భట్టి విక్రమార్క కు విన్నవించిన తెలంగాణ రైతు ఐక్య వేదిక నాయకులు*మెట్ పల్లి టౌన్, ఫిబ్రవరి 11,జనంసాక్షి :జగిత్యాల జిల్లాలోని ఏకైక వ్యవసాయ ఆధారిత పరిశ్రమ అయిన ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ విషయమై తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించాలని కోరుతూ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కను హైదరాబాద్ లో శనివారం నాడు తెలంగాణ రైతు ఐక్యవేదిక నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని వాగ్దానం చేసిన సీఎం కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి 8 సంవత్సరాలు దాటిపోతున్నప్పటికీ
ప్రస్తుతం ఆ ఊసే ఎత్తకుండా తప్పించుకునే ధోరణిని అవలంబిస్తున్నారని ఆరోపించారు, 2002 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రైవేట్ సంస్థకు అప్పగించగా 2002 నుండి 2014 వరకు ప్రైవేట్ సంస్థ ఆధీనంలో నడుస్తున్న ఫ్యాక్టరీని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తేది 23-12-2015 రోజున లే-అఫ్ అని ప్రకటించడముతో రైతులు , కార్మికులు,ఉద్యోగులు రొడ్డున పడ్డారని అన్నారు.ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు,నిరాహార దీక్షలు , రాస్తారోకోలు,పాదయాత్రలు,
అసెంబ్లీ ముట్టడి వంటి తదితర ఉద్యమాలను,ఎన్నో నిరసన కార్యక్రమాలను చేపట్టినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏమాత్రం స్పందన రాకపోవడం విచారకరమన్నారు.చెరుకు రైతులు ప్రస్తుతం పంటను 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న కామారెడ్డి ఫ్యాక్టరీకి తరలించడం ద్వారా రవాణా ఖర్చు భారంగా మారడంతో పాటు టన్నుకు 800 రూపాయల ఖర్చుల భారం మీద పడుతుండడంతో రైతులు ఆర్ధికంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు,ఈ సందర్భంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ విషయమై అసెంబ్లీలో ప్రస్తావించి రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్తానని ఈ సందర్భంగా తెలంగాణ రైతు ఐక్య వేదిక నాయకులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో చెరుకు రైతు ఉత్పత్తి దారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణరెడ్డి ,నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ అధ్యక్షుడు గురిజాల రాజారెడ్డి , తెలంగాణ రైతు ఐక్యవేదిక నాయకులు న్యావనంది లింభారెడ్డి , పుప్పాల నగేష్ , తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మెట్ పల్లి లో తెలిపారు.




