Thursday, 5 November 2026

మూడు స్థానాలు ఓకే!

– మూడు స్థానాలతో సరిపెట్టుకున్న సీపీఐ!
– మూడు ఎమ్మెల్యే, రెండు ఎమ్మెల్సీ సీట్లకు ఓకే
– హుస్నాబాద్‌, వైరా, బెల్లంపల్లి సీపీఐకి
– హస్నాబాద్‌ చాడ వెంకటరెడ్డి, వైరా నుంచి విజయ బరిలోకి
హైదరాబాద్‌, నవంబర్‌13(జ‌నంసాక్షి) : మహాకూటమిలోని పార్టీల్లో సీట్ల సర్దుబాటుపై కొలిక్కి వస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్‌, టీడీపీ అభ్యర్ధులు జాబితా ప్రకటించారు. కాగా మంగళవారం కాంగ్రెస్‌ నేతలతో మరోసారి భేటీ అయిన సీపీఐ అధిష్టానం మెట్టు దిగింది. కాంగ్రెస్‌ పార్టీ ఇస్తామన్న మూడు స్థానాలు, రెండు ఎమ్మెల్సీలకు ఓకే చెప్పింది. తొలుత పది స్థానాలు కావాలంటూ మహాకూటమిలో భాగమై పంచాయితీ పెట్టిన సీపీఐ, నిన్నటివరకూ ఐదు స్థానాలు కావాల్సిందేనని, లేకుంటే విడిపోతామని చెబుతూ వచ్చి. కాగా నేడు మెట్టుదిగింది. కాంగ్రెస్‌ ఆఫర్‌ చేసిన మూడు స్థానాలతో సరిపెట్టుకునేందుకు ముందుకు వచ్చింది. ఇదే సమయంలో సీట్ల విషయంలో అసంతృప్తిగా ఉన్న ఆ పార్టీ అలక తీర్చేందుకు కాంగ్రెస్‌ కూడా ఓ మెట్టు
దిగి, ఎన్నికల తరువాత రెండు ఎమ్మెల్సీ స్థానాలను సీపీఐ వెల్లడించిన నేతలకు ఇచ్చేందుకు సిద్ధపడింది. దీంతో మహాకూటమిలో ఏర్పడిన లుకలుకలు, సీట్ల సర్దుబాటు దాదాపు ముగిసినట్లయింది. తెలంగాణ రాష్ట్ర సమితిని గద్దె దించాలన్న ఏకైక లక్ష్యంతో మహాకూటమి ఏర్పడగా, కాంగ్రెస్‌ సోమవారం రాత్రి 65మందితో తొలి జాబితాను ప్రకటించగానే, టీడీపీ 9మందితో జాబితా విడుదల చేసింది. ఇక సీపీఐకి హుస్నాబాద్‌, వైరా, బెల్లంపల్లి ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సిద్ధంగా ఉంది. హుస్నాబాద్‌ నుంచి చాడ వెంకటరెడ్డి, వైరా నుంచి విజయ పేర్లు ఖరారు కాగా, బెల్లంపల్లి నుంచి ఎవరిని బరిలోకి దింపాలన్న విషయమై ఆ పార్టీ నేతలు చర్చిస్తున్నారు. ఈ విషయంలో బుధవారం కల్లా ఓ స్పష్టత రానుండగా, ఆపై సీపీఐ తన అభ్యర్థుల పేర్లను వెల్లడించనున్నట్టు తెలుస్తోంది.