Wednesday, 4 November 2026

మెస్‌ ఛార్జీలు పెంచాలి: హరీష్‌రావు

హైదరాబాద్‌: రాష్ట్రంలోని వసతి గృహాల్లో మెస్‌ ఛార్జీలు పెంచాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్‌  చేశారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని ముఖ్యమంత్రి గొప్పలు చెప్పుకుంటూ, మూడు పూటల భోజనానికి ఒక్కో విద్యార్థికి రూ. 17.80 చొప్పున విడుదల చేయడం దారుణమన్నారు. రూ,17.80తో భోజనం పెట్టడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఈ పైసలకు బయట కనీసం ఇడ్లీ, వడ దొరకడం లేదని తెలియజేశారు.  మెస్‌ ఛార్జీలను రూ. 1000కి పెంచాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు. వసతి గృహాల్లో విద్యార్థుల కష్టాలను పట్టించుకునే స్థితిలో ప్రభుత్వం లేదని మండిపడ్డారు. హాస్టళ్లకు సరిపడ వంట గ్యాస్‌ సిలిండర్లను సరఫరా చేయాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు. వంట గ్యాస్‌ సిలిండర్ల కొరతతో విద్యార్థులు భోజనం మానేసే పరిస్థితి ఏర్పడిందన్నారు.  ప్రభుత్వానికి స్టార్‌హోటళ్లపై ఉన్న ప్రేమ వసతి గృహాలపై లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్‌ విద్యార్థుల పక్షాన టీఆర్‌ఎస్వీ నిరంతరం పోరాడుతుందని ఆయన తెలియజేశారు. రేపటి నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతామన్నారు. తెలంగాణ కోసం నిరందరం తాము పోరాటం చేస్తామని స్పష్టం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *