హైదరాబాద్ ,సెప్టెంబర్ 28(జనంసాక్షి):యాదాద్రి దేవస్థానం తుది నమూనాకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపారు. ఆలయ కట్టడాలు, కాటేజీ నిర్మాణాల త్రీడీ చిత్రాలను కేసీఆర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే దసరా నాటికి యాదాద్రి ఆలయాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేక నిర్మాణ కౌశలంతో దైవభక్తి ఉట్టిపడేలా దేవస్థానం ఉండాలని సూచించారు. గొప్ప శిల్పకళా నైపుణ్యంతో దేవస్థానం రూపుదిద్దుకోవాలని ఆకాంక్షించారు. 5 రాజగోపురాలు, ప్రాకార మండపాలు పూర్తిగా శిలతో నిర్మితం కానున్నాయని సీఎం తెలిపారు. ఆగమశాస్త్ర సూత్రాలకనుగుణంగా దేవస్థానం రూపుదిద్దుకోనుందని చెప్పారు. వేల సంవత్సరాల కిందటి సంప్రదాయ నిర్మాణ కౌశలానికి యాదాద్రి ప్రాణప్రతిష్ఠ పోయనుందన్నారు.108 అడుగుల అంజేయస్వామి భారీ పాలరాతి విగ్రహ నమూనాకు సీఎం అనుమతి ఇచ్చారు. భారీ ఆంజనేయ విగ్రహాన్ని తీర్చిదిద్దేందుకు చైనా శిల్పిలు ముందుకొచ్చారు. త్వరలో చైనాను ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి, దేవాలయ కమిటీ సభ్యులు సందర్శించనున్నారు.




