యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ భూ నిర్వాసితులకు వెంటనే న్యాయం చేయాలి: డిసిసిబి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్
అక్రమ అరెస్టులతో ప్రజల గొంతు నొక్కలేరు.
థర్మల్ ప్లాంట్ కింద భూమిని కోల్పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.
తిరుమలగిరి (సాగర్) నవంబర్ 28 (జనంసాక్షి):
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో భూమిని కోల్పోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని నల్గొండ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .సోమవారం దామరచర్ల వద్ద నిర్మిస్తున్న యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలించడానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు వస్తున్న సందర్భంగా దామరచర్ల, అడవిదేవులపల్లి మండలాల భూ నిర్వాసితుల తో కలిసి శంకర్ నాయక్ ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం అందజేయాలని ప్రయత్నించగా తనను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి తిరుమలగిరి సాగర్ పోలీస్ స్టేషన్కు తరలించారని ఆయన అన్నారు. అక్రమ అరెస్టులతో తమ గొంతు నొక్కలేరని, ఈ ప్రాంత రైతులు వారు సేద్యం చేసుకుంటున్న భూములను థర్మల్ ప్లాంటు నిర్మాణం కొరకు ఇచ్చినప్పటికీ, వారికి ఇచ్చిన హామీలు నేటి వరకు నెరవేరలేదని తమ కు రావలసిన హామీలను నెరవేర్చమని అడిగిన రైతులను అరెస్టు చేయడం హేయమైన చర్య అన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైన ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడటం సరికాదన్నారు . ప్రభుత్వం తక్షణమే భూ నిర్వాసితులకు ఇచ్చిన హామీ ప్రకారం వారికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, థర్మల్ ప్లాంట్ లో అర్హులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .నిర్వాసితులకు న్యాయం జరిగే వరకూ వారి తరఫున కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని అవసరమైతే సీఎండీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో ఆయన వెంట అడవిదేవులపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాలు నాయక్, నాగార్జునసాగర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మేరావత్ ముని నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు రమావత్ కృష్ణ నాయక్, బూడిద కొండల్, బాలు, పాండు ,రంగా తదితరులు ఉన్నారు.




