హైదరాబాద్ : ఎల్బీనగర్ సమీపంలోని అల్కపురిలో ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ కోసం కారును ఆపేందుకు ప్రయత్నించిన పోలీసులను కారుతో ఢీకొట్టారు. శుక్రవారం రాత్రి అల్కపురి ప్రధాన రహదారిపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ఎల్బీనగర్ నుంచి ఇద్దరు యువకులు వేగంగా కారు నడుపుతూ వచ్చారు. వారిని ఆపేందుకు పోలీసులు బారీ కేడ్లు అడ్డుపెట్టారు. ఎలాగైనా తప్పించుకోవాలనే ఉద్దేశంతో యువకులు కారు వేగం పెంచి… బారీకేడ్లను బలంగా ఢీకొట్టారు. ఈ సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న హోంగార్డు యాదగిరిరెడ్డిపై కారు దూసుకెళ్లింది. యువకులు పారిపోయేందుకు ప్రయత్నించగా… రోడ్డుపై ఓ గుంతలో కారు ఇరుక్కుపోవడంతో ఎటూ వెళ్లలేకపోయారు. ఈ ఘటనలో హోంగార్డు యాదగిరిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ కాలు పూర్తిగా విరిగిపోయింది. యాదగిరిరెడ్డి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనకు కారణమైన యువకులను పోలీసులు అదుపులోకి తీసకున్నారు.




