రాజన్న సిరిసిల్ల బ్యూరో. మే 12. (జనంసాక్షి). అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనం యువ రైతు ప్రాణాలను బలిగొంది. ధాన్యం మిల్లు నుంచి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తున్న రైతును తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామ శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న అశోక్ లేలాండ్ పిక్ అప్ వాహనం డీకొట్టడంతో రైతు అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయాడు. స్థానికులు మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం తంగళ్ళపల్లి మండలం దేశాయ్ పల్లి గ్రామానికి చెందిన యువరైతు గట్టు బాల్ రెడ్డి (38) ధాన్యాన్ని రైస్ మిల్లు కు తరలించాడు. తేమశాతం ఎక్కువ వచ్చిందని చెప్పడంతో బాల్ రెడ్డి రైస్ మిల్లుకు వెళ్లి తిరిగి వస్తుండగా గురువారం రాత్రి సుమారు ఏడు గంటల సమయంలో సారంపల్లి గ్రామ శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న అశోక్ లేలాండ్ పిక్ అప్ వాహనం బాల్ రెడ్డి నీ ఢీ కొట్టి తలపై నుంచి వెళ్లడంతో బాల్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య ఉమా. రుత్వీక.,సాత్విక. ఇద్దరమ్మాయిలు ఉన్నారు.
ఆగ్రహించిన మృతిని బంధువులు గ్రామస్తులు అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో పరిస్థితి ఉద్రిక్తం.
యువరైతు బాల్ రెడ్డి ని అక్రమ ఇసుక రవాణా ప్రాణం తీసిందని ఆరోపిస్తూ గ్రామస్తులు మృతుని బంధువులు శుక్రవారం జిల్లా ఏరియా ఆసుపత్రి ముందు అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో చేపట్టారు. ఇంకెంత మంది ప్రాణాలు తీస్తారంటూ రోదిస్తూ మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని ఆందోళన విరవింపజేసే ప్రయత్నం చేయడంతో గ్రామస్తులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వి వాదం చోటుచేసుకుంది. ఆందోళన చేస్తున్న గ్రామస్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన యువరైతు కుటుంబ సభ్యుల రోజున కంటతడి పెట్టించాయి.




