హైదరాబాద్ :రంగారెడ్డి జిల్లా ఖల్సా గ్రామంవద్ద 150 ఎకరాల్లో ఫైబర్ గ్లాస్ పార్క్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు అధికారులు పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తున్నది. నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక వాడలు, క్లస్టర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విష యం తెలిసిందే. కందుకూరు మండలం ముచ్చర్ల వద్ద 11 వేల ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ఫార్మా సిటీ, యూనివర్సిటీలు ఏర్పాటు చేయనున్నది. ఈ ఊపులో అధికారులు గ్లోబల్ మార్కెట్ ట్రెండ్లకు అనుగుణంగా సూక్ష్మ ,చిన్న తరహా పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కలిగించే ఫైబర్ పార్క్ ఏర్పాటును ప్రతిపాదించారు. ఖల్సా గ్రామంలో 150 ఎకరాల్లో దీని ఏర్పాటుకు పతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినట్లు టీఎస్ఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ వెంకటనర్సింహారెడ్డి ధృవీకరించారు.
ఫైబర్‌గ్లాస్ ఇండస్ట్రికి మంచి డిమాండ్: అనేక ఏండ్లనుంచి ఫైబర్‌గ్లాస్ ఇండస్ట్రీ కార్యకలాపాలకు మంచి డిమాండ్ ఉన్నది. హైదరాబాద్ పరిసరాల్లో 100కు పైగా యూనిట్లు హెల్మెట్ల నుంచి రాకెట్ల విడిభాగాల వరకు తయారు చేస్తున్నాయి. కెమికల్ ప్రాసెస్ ట్యాంకులు, ఆటోమొబైల్ విడిభాగాలు, మైక్రో వేవ్ ట్రాన్సిమిటింగ్ రాడార్లు, యాంటినా, డిఫెన్స్, ఏరోస్పేస్ అప్టికేషన్స్, బిల్డింగ్ మెటీరియల్స్ కూడా తయారు చేస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004లో వెయ్యి మెట్రిక్ టన్నుల ఫైబర్గ్లాస్ను వినియోగిస్తే, 2015 నాటికి అది 20 వేల మెట్రిక్ టన్నులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈ రంగం విస్తరించాల్సిన అవసరం ఉన్నదని ఎంఎస్ఎంఈడీ ఇన్స్టిట్యూట్ గుర్తించింది. 2008 జూన్ 25న ఢిల్లీలో జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశం కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఫైబర్ గ్లాస్ క్లస్టర్ అభివృద్ధి చేయాలని సూచించింది.
వెయ్యి కోట్ల ఎగుమతులు..: ఫైబర్ రంగంలో క్లస్టర్ ఏర్పాటు ద్వారా 5 వేల మందికి ప్రత్యక్షంగా, 10 వేల మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుందని అంచనా. ఈ రంగంలోని పారిశ్రామికవేత్తల్లో 90 శాతం సూక్ష్మ రంగానికి చెందిన వారే ఉంటారు. 10 శాతం వరకు మాత్రమే చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉంటాయి. ఈ ఒక్క క్లస్టర్ ద్వారా రూ.1000 కోట్ల ఎగుమతులు జరిగే అవకాశం ఉందని ఫైబర్‌గ్లాస్ ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ సమీపంలో ముడి సరుకుల సరఫరాదారులు, యంత్రాల ఉత్పత్తిదారులు, అప్టికేషన్స్ డెవలపర్స్, టెక్నాలజిస్టులు అందుబాటులో ఉన్నారు. అనేక మంది కన్సల్టెంట్లు, శాస్త్రవేత్తలు కూడా పని చేస్తున్నారు. కనుక ఫైబర్‌గ్లాస్ ఇండస్ట్రీ యూనిట్లను నిర్వహించడం భారం కూడా కాదంటున్నారు.
అభివృద్ధికి కృషి చేస్తున్నాం : శివసాంబిరెడ్డి
రాష్ట్రంలో ఫైబర్ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం అనేక కార్యకలాపాలు చేపట్టామని తెలంగాణ అండ్ ఆంధ్ర కంపోజిట్ మ్యానుఫాక్చరర్స్ అసోసియేషన్, ఫైబర్‌గ్లాస్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు బీ శివసాంబిరెడ్డి నమస్తే తెలంగాణకు చెప్పారు. అసోసియేషన్ కృషితో ఎంటర్‌ప్రెన్యూ ర్స్, కాంపోజిట్స్ అభివృద్ధి చెందారన్నారు. టెక్నికల్ సెమినార్లు, వర్క్‌షాపులు నిర్వహించామని, జాతీ య, అంతర్జాతీయ ఎగ్జిబిషన్లు, ఎక్స్పో, ఇండస్ట్రియల్ విజిట్స్ వంటి కార్యక్రమాలు చేపట్టామని ఆయన తెలిపారు.
తమ సంస్థ ఫిక్కి, ఫ్యాప్రియా, టిఫ్, ఎఫ్ఆర్పీ ఇన్స్టిట్యూట్, ఫ్యాప్సీ, ఎఫ్ఐఎస్ఎంఈ, సీపెట్, ప్లాస్ట్ ఇండియా, ఎన్ఎస్ఐసీ, నిమ్స్ మె వంటి సంస్థలతో కలిసి పని చేస్తుందన్నారు. డీఆర్డీఏ, దాని అనుబంధ సంస్థల్లోనూ ఫైబర్ మిశ్రమాలతో కూడిన అనేక ఉత్పత్తులు తయారయ్యేవని, డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల్లోనూ వీటి వినియోగం అధికంగానే ఉందని చెప్పారు. రామాయణ, మహాభారత కాలాల నుంచే మన దేశంలో ఫైబర్ ఇండస్ట్రి ఉండేదని, మహాభారత కాలంలోనే లక్క ఇంటిని నిర్మించారని వివరించారు.





