రాగుల మల్లన్న గుడి వద్ద కరంటు, నీటి సౌకర్యం కరువు.
– ఇబ్బందులు పడుతున్న భక్తులు.
బెల్లంపల్లి, డిసెంబర్ 2, (జనంసాక్షి )
బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం నందులపల్లి రాగుల మల్లన్న గుడి వద్ద అసౌకర్యాలతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. షష్టి వారాలు ప్రారంభమయ్యి పది రోజులు గడుస్తున్నా గుడి వద్ద ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతు బోనాలు సమర్పిస్తున్నారు. ప్రతి ఏటా ఇదే తంతు కొనసాగుతుందని, ఆలయ పూజారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గుడి వద్ద బోనాలు వండి సమర్పించే సరికి చీకటి పడుతుందని కనీసం కరెంటు సౌకర్యం కూడా లేక పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా నీటి సౌకర్యం కూడా లేదని నీళ్ల కోసం కనీసం అర కిలో మీటర్ నడిచి వెళ్లి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడిందని భక్తులు గుడి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరుగుదొడ్లు, మూత్ర శాలలు అసలుకే లేవని అరకొర సౌకర్యాల మద్య బోనాలు సమర్పించాల్సి వస్తుందని, అధికారులు గాని, ప్రజాప్రతినిధులు గాని, గుడి నిర్వాహకులు గాని స్పందించి రావుల మల్లన్న గుడి నీటి వసతి, కరెంటు సౌకర్యం, మూత్ర శాలలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.
రాగుల మల్లన్న గుడి వద్ద కరంటు, నీటి సౌకర్యం కరువు.




