Wednesday, 4 November 2026

రాజకీయ లబ్ధికి పార్టీల పాకులాట

దేశానికి బుక్కెడు బువ్వ పెట్టే అన్నదాత పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. సాగుకు చేసిన అప్పులు, కరవు పరిస్థితులు రైతన్నను రాచిరంపాన పెడుతున్నాయి. పెట్టిన పెట్టుబడి కూడా రాని దుస్థితి. సరైన దిగుబడి కూడా రాని పరిస్థితి. అంతో ఇంతో పండిన పంటకు గిట్టుబాటు ధర లేక అన్నదాత దిగులు చెందుతున్నారు. దిక్కుతోచని పరిస్థితిలో ఉరికొయ్యలకు ఉసురుపోసుకుంటున్నాడు. కొన్ని పార్టీలు తమ రాజకీయ లబ్ధి కోసం, రైతుల్లో భరోసా నింపే ప్రయత్నాలకు బదులు మరింత ఆందోళనను పురిగొల్పే చర్యలకు పాల్పడుతున్నాయి.

దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు ఇవాళ్టికి ఇవాళ పుట్టుకు వచ్చిన సమస్య కాదు. అనేక ఏండ్లుగా అనేక కారణాలు, కొన్ని వైఫల్యాలు కలగలిసిపోయి పెరుగుతూ వచ్చిన దైన్యం. ఇవాళ దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ, అన్ని రకాల పార్టీలూ ఏలుతున్న రాష్ర్టాల్లోనూ ఈ విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే రాజకీయపార్టీలు విశాల దృక్పథంతో ఆలోచన చేయడానికి బదులు సంకుచిత రాజకీయ ధోరణులతో వ్యవహరిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలు మాత్రం తాము అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఒకరకంగా.. లేనిచోట్ల మరోరకంగా రైతు ప్రాణాలను బేరీజు వేస్తున్నాయి. ఇక కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్న రైతుల ఆత్మహత్యలను పరిశీలిస్తే చత్తీస్‌గఢ్‌ ప్రథమస్థానంలో ఉంది. మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తదుపరి స్థానాల్లో ఉన్నాయి. ఈ ఏడాది ఆత్మహత్యలు చేసుకున్న రైతుల సంఖ్య ను పరిగణనలోకి తీసుకున్నప్పుడు మహారాష్ట్ర, కర్నాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఈ రాష్ర్టాల్లో కొన్నేళ్లుగా అధికారంలో ఉన్నవి బీజేపీ, కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు. మహారాష్ట్రలో గత మూడు నెలల్లోనే 601 మంది రైతు లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు…

ప్రత్యేకించి తెలంగాణ ప్రాంత భౌగోళిక పరిస్థితులు, వాతావరణమే కనిపించే మహారాష్ట్రాలోని విదర్భ ప్రాంతంలో 319 మంది, మరట్వాడా ప్రాంతంలో 215 మంది ప్రాణాలు తీసుకున్నారు. అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఆత్మహత్యలను నివారించలేకపోతోంది. కానీ తెలంగాణలో మాత్రం బీజేపీ రైతుల ఆత్మహత్యలపై యాగీ చేస్తుంటుంది. కర్నాటకలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు 39 మంది ఆత్మహత్యలు చేసుకోగా, ఒక్క జూలైలోనే 182 మంది ప్రాణాలు తీసుకున్నారు. అక్కడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. రాహుల్ గాంధీ అక్కడ పర్యటించటానికి సాహసించరు గానీ, తెలంగాణలో పర్యటనకు ఉబలాటపడిపోతారు. ఇందులోని ఆంతర్యామేంటో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

2013 ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సర్వే ప్రకారం దేశంలో 46 శాతం మంది రైతుల ఆస్తులకూ అప్పులకూ నడుమ నిష్పత్తి 2.5 రెట్లుగా ఉంది. తెలంగాణలో అది 74 శాతం, మహారాష్ట్రలో 56 శాతం, కర్నాటకలో 55 శాతం. ఆత్మహత్యల విషాదం వెనుక ఈ అంకెలు, సంఖ్యల పునాది కూడా ఉంది. కేంద్రంలో ఇన్నేళ్లుగా అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం లక్షలోపు రుణాలమాఫీ చేయడం ద్వారా దీన్ని గణనీయంగా తగ్గిస్తున్నది. ఈ తగ్గుదల వివరాలు తరువాత సర్వేలో బయటపడతాయి. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఈ స్థితికి తీసుకొచ్చిన పాపం తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలదే. పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తుంటే… ఈ నేతలే అన్నీ మరిచి గొంతులు చించుకుంటున్నారు.

టీడీపీ అధికారంలో ఉన్న అవశేష ఆంధ్రప్రదేశ్ విషయమే తీసుకుంటే, రాష్ట్ర విభజన తరువాత ఇప్పటివరకు ఒక్క అనంతపురం జిల్లాలోనే 108 మంది రైతులు బలవన్మరణం పొందారు. ఒక్క ఆగస్టులోనే 18మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇక కర్నూలు జిల్లాలో 45 మంది రైతులు ప్రాణాలు తీసుకున్నారు. ఇంత దారుణ పరిస్థితులు ఏపీలో నెలకొన్నా..అక్కడి ప్రభుత్వం మాత్రం వీటిపై స్పందించడం లేదు. మాటిమాటికి తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతూ..కుట్రలకు పాల్పడుతున్నది.

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత 15 నెలల కాలంలోనే తెలంగాణ సర్కారు పలు తక్షణ ఉపశమన చర్యలతో పాటు దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించగల శాశ్వత ప్రణాళికలకు పూనుకుంది. సమైక్య పాలనలో జరిగిన తప్పులను ఒకవైపు సరిదిద్దుతూనే, కొత్త ఆశావహ వాతావరణం కోసం ఆలోచనలకు పదునుపెడుతున్నది. ఆత్మహత్యలు జరుగుతున్నాయని అంగీకరిస్తూనే, దాని నివారణకు ఆచరణీయ ఆలోచనలు చేస్తున్నది. పలు సంక్షేమ పథకాలనూ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నది. తక్షణ ఉపశమనం కోసం రుణమాఫీ ప్రకటించి నాలుగు దశలుగా లక్షలోపు రుణాలు మాఫీ చేస్తున్నది. 1000 రూపాయల సామాజిక పెన్షన్ తో పాటు..రేషన్ బియ్యం పరిమితి సడలించి ఒక్కో వ్యక్తికి ఆరు కిలోల బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. వర్షపాతం పెరగడానికి హరితహారం పథకం, సాగునీటి ప్రాజెక్టులను మన అవసరాలకు అనుగుణంగా రీడిజైన్ చేయడం, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతోపాటు కొత్త ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ… ఏటా 25 వేల కోట్ల వ్యయానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. చెరువుల పునరుద్దరణకు మిషన్ కాకతీయ ప్రాజెక్టు, కోతల్లేకుండా వ్యవసాయ కరెంటు సరఫరా చేయడం లాంటి చర్యలు చేపట్టింది. అంతే కాకుండా ఇప్పటికి 409 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్టు చెప్తున్న ప్రభుత్వం అందులో 141 మందికి పరిహారం చెల్లించేసింది. మిగతావి విచారణ పూర్తికాగానే డబ్బు ఇవ్వటానికి కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇచ్చింది.

నిజానికి వ్యవసాయాన్ని ప్రభావితం చేసే అనేక కీలకాంశాలపై నిర్ణయాధికారం కేంద్రానిదే. కేంద్రం సరైన ప్రణాళికలు రచించి, దానికి అనుగుణంగా పకడ్బందీ పథకాలు ఆచరణలోకి తీసుకొస్తేనే రైతుకు సరైన భరోసా కలుగుతుంది. కానీ అలాంటి పరిస్థితి ఎక్కడా కన్పించడం లేదు. పైగా పార్టీలన్నీ రాజకీయ లబ్ఢి కోసం పాకులాడుతున్నాయి. ఇలాంటి ఆలోచనలు విస్మరించినప్పుడే..రైతు రాజ్యం వర్ధిల్లుతుంది. దేశానికి బుక్కెడు బుబ్బ పెట్టే అన్నదాత ఆందోళన తగ్గుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *