Monday, 2 November 2026

రాజ్యాంగం కల్పించిన హక్కులతోనే సాకారమైన తెలంగాణ: మంత్రి గంగుల

కరీంనగర్‌: రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుందామని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. ఈ నెల 5న జగ్జీవన్‌ రామ్‌, 14న అంబేద్కర్‌ జయంతి నేపథ్యంలో ఉత్సవాల నిర్వహణపై కరీంనగర్‌ జిల్లా కలెక్టరేట్‌లో అధికారులు, వివిధ సంఘాల నాయకులతో మంత్రి గంగుల కమలాకర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇద్దరు నేతల జయంతి ఉత్సవాలను పండుగలా జరిగేలా ప్రతిఒక్కరు సహకరించాలని కోరారు. బీఆర్‌ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ దళితుల అభ్యున్నతి కోసమే కాకుండా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం పని చేసిన మహనీయులని కొనియాడారు. భావితరాలకు ఈ మహనీయుల జీవిత చరిత్ర తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. వారు చూపినదారి మనందరికీ అనుసరణీయమని తెలిపారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.