Wednesday, 4 November 2026

రాష్ట్రస్థాయి సైన్స్ ఫేర్ కు బెల్లంపల్లి సిఓఈ విద్యార్ధి

రాష్ట్రస్థాయి సైన్స్ ఫేర్ కు బెల్లంపల్లి సిఓఈ విద్యార్ధి
– జిల్లస్థాయి రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శనలో ఆకట్టుకున్న విద్యార్ధి
ప్రదర్శన.
– సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతి.
బెల్లంపల్లి, డిసెంబర్ 4, (జనంసాక్షి )
ఈనెల 2నుండి 3వరకు జరిగిన రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన – 2022 జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ లో తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ(సిఓఈ) బెల్లంపల్లిలో 9వ తరగతి చదువుచున్న సాయి విఘ్నేష్ ప్రథమ బహుమతి సాధించాడని ప్రిన్సిపాల్ ఐనాలా సైదులు తెలిపారు. విద్యార్థుల్లో వైజ్ఞానిక అంశాల పట్ల ఆసక్తిని కలిగించడం, పరిశోధనలపై ఆసక్తిని పెంపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిర్వహించే రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన జిల్లా స్థాయిలో ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో రెండురోజుల పాటు జరిగిందన్నారు. ఈ సైన్స్ ఫేర్ లో బెల్లంపల్లి నుండి వినూత్నమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న సాయివిఘ్నేష్ సీనియర్స్ విభాగంలో ప్రధమ బహుమతి సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు వివరించారు. అడవుల జిల్లాగా పేరుందిన ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లోని అటవీ ప్రాంతానికి సమీపంలోని గల రైతులు తమ పంట పొలాల్లో అడవి జంతువుల బారినుండి పంటలను రక్షించుకోవడంతో పాటు వన్యప్రాణులకు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా ప్రత్యేకమైన పరికరాన్ని కనిపెట్టాడన్నారు. ఈ పరికరం ద్వారా రైతులు పొలంలోకి వన్యప్రాణులు రాకుండా కాపాడుకోవచ్చునని విద్యార్థి సాయి విఘ్నేష్ వివరించి అబ్బురపరిచాడు. గురుకులంలోని సైన్స్ బోధించే ఉపాధ్యాయుడు కొక్కుల రాజేశ్వర్ సలహాతో విద్యార్థి ఈ పరికరాన్ని తయారుచేసినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. తక్కువ ఖర్చుతో సులభంగా రైతులు పంట పొలాల దగ్గర అమర్చుకునేలా ఈ పరికరాన్ని తయారుచేసి వాహ్వా అనిపించారు. సెన్సార్లు ఉపయోగించి పొలం వైపుకి వచ్చే అటవీ జంతువులను గుర్తించి భయపెడుతూ బెదిరించే శబ్దాలను ఉత్పత్తి చేస్తూ వన్యప్రాణులను వెళ్ళగొట్టి పంటను పాడు చేయకుండా కాపాడవచ్చుఅని విద్యార్ధి వివరించాడు.
అంతేకాకుండా పగటివేళ్లలో సెన్సార్లు పంట పొలాల దరిదాపుల్లోకి మనుషులు కానీ జంతువులు కానీ వచ్చినప్పుడు రైతుకుచెందిన మొబైల్ కు మెసేజ్ వచ్చేలా అమర్చారు. దీనిద్వారా పంటకోతలసమయంలో దొంగల భయం లేకుండా కాపాడుతుంది. రాత్రి వేళలో ఇవే సెన్సార్ల ద్వారా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సౌండ్ సిస్టం ద్వారా శబ్దాలను ఉత్పత్తి చేస్తుంది. భయంకరమైన ఈ శబ్దాలవల్ల జంతువులు భయపడి బెదిరిపోయి పారిపోతాయి. ఈ విధంగా వన్యప్రాణులు పంట పొలాలను ఆగం చేయకుండా వాటికి ప్రాణ నష్టం కలిగించకుండా రైతులు తమ పంటను కాపాడుకునే విధానాన్ని చక్కగా వివరించి ఆకట్టుకున్నాడు. ఇటీవల బెల్లంపల్లి లో జరిగిన సంక్షేమ గురుకులాల జోనల్ స్థాయి సైన్స్ ఫేర్ లో సైన్స్ & టెక్నాలజీ విభాగంలో ద్వితీయ బహుమతి సాధించాడు. అలాగే కరోనాకంటే ముందు జిల్లాలో 2018, 2019 సంవత్సరాల్లో జరిగిన సైన్స్ ఫేర్ లలో వరుసగా బహుమతులు సాధించాడు. ఇలా ప్రతి సైన్స్ ఫేర్ లో బహుమతులు సాధిస్తూ వహ్వా అనిపిస్తున్నారు ఇక్కడి విద్యార్ధులు. శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించడమే కాకుండా సమాజానికి ఉపయోగపడే వైజ్ఞానిక మరియు సాంకేతిక అంశాలను జోడించి అనేక పరికరాలను విద్యార్ధులు తయారుచేసేలా ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తూ ప్రోత్సహించడం అభినందనీయమని సంక్షేమ గురుకులాల ఆదిలాబాద్ ప్రాంతీయ సమన్వయ అధికారి కొప్పుల స్వరూప రాణి ఆనందం వ్యక్తంచేశారు.
సైన్స్ పాఠ్యంశాలను తరగతి గది కంటే ప్రయోగశాలలో విద్యార్ధులే స్వయంగా చేస్తూ నేర్చుకునేలా ప్రోత్సహిస్తున్న బెల్లంపల్లి ఉపాధ్యాయులను, ఆదిశగా కృషి చేస్తున్న విద్యార్ధులను ఆమె ఈసందర్భంగా అభినందించారు.