రాష్ట్రంలో చలిపులి పంజా విసురుతోంది. ఒక్కసారిగా చలి తీవ్రత పెరగడంతో జనం అల్లాడిపోతున్నారు. చలి తీవ్రతతో ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయింది. రాత్రీపగలు తేడా లేకుండా శీతల గాలులు వీస్తుండడంతో, ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకే ప్రజలు జంకుతున్నారు.విపరీతమైన చలి రాష్ట్రాన్ని గజగజలాడిస్తోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతలగాలులతో అకస్మాత్తుగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో గత నాలుగు రోజుల నుంచి ప్రజలు గజగజా వణికిపోతున్నరు. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో రికార్డుస్థాయిలో 5.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవడం గత ఎనిమిదేండ్లలో ఇదే మొదటిసారి. రాబోయే రెండు మూడురోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రంగారెడ్డిలో కనిష్ఠ ఉష్ణోగ్రత 8.4 డిగ్రీలకు పడిపోయింది. కరీంనగర్ 8.8, మెదక్ 9.2, నిజామాబాద్ 11.1, వరంగల్ 11.5, హైదరాబాద్ 14, నల్లగొండ 16, ఖమ్మం 17, మహబూబ్‌నగర్ జిల్లాలో 18 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలలోపే నమోదవుతున్నాయి. చలి తీవ్రత ఎక్కువ ఉండటంతో పల్లెల్లో ఉదయం 9 గంటల వరకు చలిమంట కాగుతున్నారు. పనుల మీద బయటకు వచ్చేవారు ఉన్ని దుస్తులు ధరిస్తున్నారు.
మరోవైపు చలి తీవ్రతను తట్టుకోలేక జనం పిట్టల్లా రాలుతున్నారు. అటవీ ప్రాంతంలోని గిరిజనులైతే చలికి గజగజలాడిపోతున్నారు. చలి తీవ్రతతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు చనిపోయారు. చలి ప్రభావంతో వృద్ధులు, చిన్నారులకు ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలున్నాయని, తగిన జాగ్రతలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటే చలి తీవ్రతను తట్టుకోగలమని చెప్తున్నారు.
అటు హైదరాబాద్‌లోనూ చలి పంజా విసురుతున్నది. శుక్రవారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు 17.5 నమోదవగా, శనివారం ఏకంగా 12.6 డిగ్రీలకు పడిపోయాయి. రాబోయే వారం రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారు.




