Wednesday, 4 November 2026

రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం

రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని నీటిపారుదలశాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ప్రాణహిత చేవెళ్ల ను తరలించడం లేదని,కేవలం ప్రాజెక్టును రీడిజైనింగ్ మాత్రమే చేస్తున్నామని చెప్పారు. పెన్ గంగా ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు వచ్చాయని తెలిపారు. 1,227 కోట్లతో పెన్గంగ ప్రాజెక్టు సహా 3 బ్యారేజీలు నిర్మాణం చేపడతామన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రులు హరీష్ రావు, జోగురామన్న, ఇంద్రకరణ్ రెడ్డి రెండవ రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు.

ప్రాణహిత-చేవెళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం అనుమతులు కూడా సాధించలేదని హరీష్ రావు మండిపడ్డారు. టీడీపీ, కాంగ్రెస్ హయాంలోనే ప్రాజెక్టులు పెండింగ్ లో పడ్డాయన్నారు. కరువు పరిస్థితుల్లోనూ ఇంద్రావతి నుంచి..రోజుకు 2 లక్షల క్యూసెక్కుల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయన్న హరీష్ రావు..ఆ నీటిని కాపాడుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేయడం మానుకోవాలని హితవు పలికారు.

రైతుల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి హరీష్ రావు తెలిపారు. విత్తనాలు, ధాన్యం సేకరణలో ఇబ్బందులు తలెత్తకుండా..ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 160 కోట్ల రూపాయలతో..17 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు నిర్మిస్తున్నామని చెప్పారు. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్న హరీష్ రావు..వచ్చే ఖరీఫ్ నుంచి నిరంతరాయంగా..పగటిపూజ 9 గంటల కరెంట్ సరఫరా చేస్తామని తెలిపారు.

పది పన్నెండేళ్లలో ఆదిలాబాద్ జిల్లాకు సాంక్షన్ అయిన పనులు ఒక్కటి కూడా పూర్తి కాలేదని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మండిపడ్డారు. వచ్చే మూడు నాలుగు నెలల్లో మరోసారి సమీక్ష నిర్వహించి అభివృద్ధి పనులు పరిశీలిస్తామన్నారు. ఇక ఈ రివ్యూతో ఆదిలాబాద్ జిల్లాను గత పాలకులు ఎంత నిర్లక్ష్యం చేశారో స్పష్టం అయ్యిందని మరో మంత్రి జోగురామన్న ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు కావాలనే విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. విషజ్వరాలపై రాద్దాంతం చేస్తున్న విపక్షాలు ఏ ఒక్క కుటుంబాన్ని పరామర్శించిన పాపాన పోలేదని మండిపడ్డారు.

ఇప్పటికైనా ప్రతిపక్షాలు సంక్షేమ పథకాలపై రాద్దాంతం చేయకుండా సహకరించాలని మంత్రులు సూచించారు. కావాలని ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *