అనుకున్న దానికన్నా విజయవంతం అయ్యిందన్న భరోసా
హైదరాబాద్,ఆగస్ట్15(జనం సాక్షి): నగరంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రెండు రోజుల పర్యటన విజయవంతం కావడం ఆ పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహన్ని నింపింది. ప్రధానంగా నగరంలో తాము అనుకున్న దానికన్నా విజయవంతం అయ్యిందన్న ఉత్సాం కనిపిస్తోంది. సాధారణ ఎన్నికల దిశగా రాజకీయ పార్టీల అడుగులు పడుతున్న తరుణంలో రాహుల్ పర్యటన సక్సెస్ కావడంతో నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని తెచ్చిపెట్టింది. ఈ ఊపుతో వచ్చే సాధారణ ఎన్నికలకు సమాయత్తం అయ్యే దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీశ్రేణులు ఇదే ఉత్సాహంతో ఉండగానే శక్తి యాప్ ద్వారా సభ్యత్వాల నమోదును మరింత ముమ్మరం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఆయన సభలకు వచ్చిన స్పందన రావడం మంచి ఊపునిచ్చింది. పార్టీ అధినేత రెండు రోజుల పర్యటన నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కీలక నేతలు వ్యూహాత్మకంగా రెండు కీలక ప్రాంతాల్లో సభల్ని ఏర్పాటు చేశారు. శేరిలింగంపల్లి సభ ద్వారా పశ్చిమ ప్రాంతాన్ని, సరూర్‌నగర్ స్టేడియం సభ ద్వారా తూర్పు ప్రాంతాన్ని కవర్ చేసేలా ప్రణాళిక అమలు చేశారు. శేరిలింగంపల్లిలో మాజీ శాసనసభ్యుడు భిక్షపతియాదవ్, సరూర్‌నగర్‌లో ఎల్‌బీనగర్ మాజీ శాసనసభ్యుడు సుధీర్‌రెడ్డి సభల్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేశారు. స్థానిక శ్రేణులను సవిూకరించడంలో నేతలు కృతకృత్యులయ్యారు. మొదటిరోజు సభను మించేలా సరూర్‌నగర్‌లో నిర్వహించిన నిరుద్యోగ గర్జనకు కార్యకర్తలు పోటెత్తడంతో రాహుల్ పర్యటననువిజయవంతంగా ముగించామని నేతలు భావిస్తున్నారు. మరోవైపు తొలిరోజు శంషాబాద్‌లో మహిళాసంఘాలతో సమావేశం, రెండో రోజు వ్యాపారవేత్తలు, విద్యార్థి సంఘాలతో సమావేశాలు, నిరుద్యోగ సభ.. ఇలా అన్ని వర్గాలకు పార్టీ భవిష్యత్తు వ్యూహాలను రాహుల్ చేరువ చేశారని నేతలు చెబుతున్నారు.




