Wednesday, 4 November 2026

రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం సిగ్గు చేటు : కాంగ్రెస్ నాయకులు

ఎల్బీనగర్ (జనం సాక్షి )  కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గం సాగర్ రింగు రోడ్డులో కాంగ్రెస్ శ్రేణులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటాన్ని ఊరేంపుగా తీసుకొచ్చి సాగర్ రింగు రోడ్డులో దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాహుల్ గాంధీపై రాజకీయ కుట్రలో భాగంగానే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని మండిపడ్డారు. మోడీకో హటావో…దేశ్ కో బచావో అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దేశంలో అవినీతి రాజ్యమేలుతుంటే ప్రశ్నించిన రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం సిగ్గు చేటని అన్నారు. నాయకుల నిరసన, ధర్నా కారణంగా కొద్దిసేపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. వెంటనే రంగ ప్రవేశం చేసిన పోలీసులు ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు చేపట్టారు. నాయకులు నిరసన విరమించాలని పోలీసులు కోరినా నేతలు ససేమిరా అనడంతో మిద్దెల జితేందర్, జక్కిడి ప్రభాకర్ రెడ్డి, దర్పల్లి రాజశేఖరరెడ్డి తదితరులను పోలీసులు అరెస్టు చేసి పోలీసు స్టేషను కు తరలించారు.
ఈ కార్యక్రమంలో ఐ.ఎన్.టి.యు.సి. రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్, ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జక్కిడి ప్రభాకర్ రెడ్డి, లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖరరెడ్డి, పీసీసీ కార్యదర్శి గజ్జి భాస్కర్ యాదవ్, నాయకులు బుడ్డ సత్యనారాయణ, మల్లారపు శ్రీనివాసరావు,రమేష్ రెడ్డి, శశిధర్ రెడ్డి, లింగాల కిషోర్ గౌడ్, పల్స శ్రీధర్ గౌడ్, యాదగిరి, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.