హైదరాబాద్,మార్చి31(జనంసాక్షి): తెలంగాణ శాసనసభలో చివరిరోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ మధుసూదనాచారి అనుమతితో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ… కార్మికులు, గ్రావిూణ వృత్తిదారుల రుణ సహాయం కోసం కమిషన్ ఏర్పాటు బిల్లును సభలో ప్రవేశపెట్టారు. విపత్కర పరిస్థితుల్లో రైతులను రుణవిముక్తులను చేసేందుకు బిల్లు రూపొందించినట్లు వెల్లడించారు. భాజపా శాసనసభాపక్షనేత లక్ష్మణ్, ఎం.ఐ.ఎం సభ్యులు బిల్లును స్వాగతిస్తు న్నట్లు ప్రకటించారు. దీంతో రుణవిముక్తి కమిషన్ ఏర్పాటు చట్టం బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. గురువారం ఉదయం సభ మొదలైన వెంటనే స్పీకర్ అనుమతితో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ రుణవిముక్తి కమిషన్ ఏర్పాటు చట్టం బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై విపక్ష సభ్యలు స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. బీజేఎల్పీ నేత లక్ష్మణ్ మాట్లాడుతూ చిన్నకారు, సన్నకారు రైతులకు ఈ కమిషన్ ఉపసమనం కలిగించాలని ఆకాంక్షించారు. సమస్యల్లో ఉన్న రైతులకు అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రాకపోవడంతో ప్రైవేటు వ్యక్తుల వద్ద తీసుకుని తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వడ్డీ వ్యాపారస్తుల వేధింపులు తాళలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. రైతులకు వడ్డీల చెల్లింపులో ఇబ్బందుల అధిగమించేలా ఈ కమిషన్ కొనసాగాలని లక్ష్మణ్ ఆకాంక్షించారు. రైతులు శ్రేయస్సు కోరే సభ్యులతో కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై కేసీఆర్ స్పందిస్తూ ఇబ్బందుల్లో ఉన్న రైతులను దోపిడీ చేసే పద్దతిని అరికట్టడానికే ఈ బిల్లును తీసుకువచ్చామని తెలిపారు. అలాగే టీడీపీ, ఎంఐఎం, సీపీఐ, సీపీఎం, వైఎస్సార్సీపీ సభ్యులు సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఆ తరువాత మూజువాణి ఓటుతో బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం స్పీకర్ సభను పదినిమిషాల పాటు వాయిదా వేశారు.




