హైదరాబాద్ (జనంసాక్షి ) : బడ్జెట్ పై మండలిలో సర్కారు ఫుల్ క్లారిటీ ఇచ్చింది. సీఎం కేసీయార్.. స్వయంగా సభ్యుల సందేహాలను నివృత్తిచేశారు. చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టి.. తెలంగాణ వెలుగుల దిశగా ప్రయాణిస్తున్నదని తెలిపారు. మే నెల నుంచి కరెంట్ కోతలే ఉండవని ప్రకటించారు. అటు..వచ్చే రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ప్రాజెక్టులు, నీతి ఆయోగ్, హక్కుల సాధనలో అన్ని పార్టీలను కలుపుకుపోతామని సభకు తెలిపారు.
శాసనమండలి సమావేశానికి హాజరైన సీఎం కేసీఆర్.. బడ్జెట్ పై విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సావధానంగా సవివరమైన సమాధానాలు చెప్పారు. దేశంలో ప్రబలమైన మార్పులు చోటు చేసుకుంటున్నయన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిబంధనలు లేని ఫండ్ రావాలన్నారు. కేంద్రంతో కరుకుగా వ్యవహరించకుండా తప్పులను ఎత్తిచూపాలన్నారు. మన హక్కుల కోసం మనం పోరాడాల్సిందేనని చెప్పారు.
మే నెల తర్వాత రాష్ట్రంలో కరెంటు కోతలుండవన్నారు సీఎం కేసీఆర్. మండలిలో చర్చ సందర్భంగా వచ్చే ఏడాది మార్చి నుంచి రైతులకు పగటిపూటే తొమ్మిదిగంటల విద్యుత్ ఇస్తామన్నారు. చంద్రబాబు రాష్ట్రానికి కరెంటు రాకుండా అడ్డుపడ్డాడన్న సీఎం… ఇప్పుడు బాబు కరెంటు ఇస్తామన్నా తీసుకోమన్నారు.
తెలంగాణ ప్రాజెక్టులను రీ ఇంజనీరింగ్ చేయాన్నారు సీఎం కేసీఆర్. ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. మిషన్ కాకతీయకు.. మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధం లేదన్నారు. వాటర్ గ్రిడ్ కు రుణం అందించేందుకు హడ్కో ముందుకొచ్చినట్లు సీఎం తెలిపారు.
హైకోర్టు విభజనపై త్వరలోనే తీపికబురు వస్తుందన్నారు సీఎం కేసీఆర్. కొన్ని శక్తులు హైకోర్టు విభజన జరగకుండా అడ్డుపడుతున్నాయన్నారు. త్వరలో హైకోర్టు చీఫ్ జస్టిస్ ను కలుస్తానన్నారు సీఎం. అటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల జీతాల గురించి గత ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు సీఎం.
వచ్చే రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే ఐదువేల ఉద్యోగాల భర్తీకి క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలిపారు. కమల్ నాథన్ కమిటీ నివేదిక పూర్తయ్యాక భర్తీ ప్రక్రియ వేగవంతమైతదన్నారు. నిరుద్యోగులకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చి భర్తీలో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇక ఉద్యోగాల కోసం డీఎస్సీ నిర్వహించమన్న సీఎం.. రేషనలైజేషన్ పూర్తయ్యాక అవసరముంటే ఖాళీలను భర్తీ చేస్తామన్నారు.
ప్రభుత్వం ఇంతవరకు గుంట భూమికూడా అమ్మలేదని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. దీనిపై కొన్ని పత్రికలు పనిగట్టుకొని పిచ్చి వార్తలు రాస్తున్నాయన్నారు. హైదరాబాద్ లో రియల్ భూం పుంజుకుందన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎప్పటికీ తగ్గదన్నారు.
అటు సోనియా దయవల్లే తెలంగాణ వచ్చిందన్నారు సీఎం కేసీఆర్. ఈ సత్యం చరిత్రలో నిలిచిపోతదన్నారు. ఇచ్చింది సోనియాగాంధీ అయినా.. తెచ్చింది మాత్రం టీఆర్ఎస్సే నన్నారు సీఎం.
విపక్ష సభ్యుల ప్రశ్నలకు సీఎం స్పందన అనంతరం ఛైర్మన్ స్వామిగౌడ్.. సభను సోమవారానికి వాయిదా వేశారు.




