Tuesday, 3 November 2026

రేణుక వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం : కోదండరాం

హైదరాబాద్‌ : తెలంగాణ ఆత్మబలిదానాలపై కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి చేసిన తీవ్ర వ్యాఖ్యలపై తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమాన్ని కింఛపరుస్తూ ఆమె చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రేణుక ఢిల్లీలో ఉంటూ సీమాంధ్రకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రేణుకా చౌదరీపై పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణకు ఇవాళ ఫిర్యాదు చేశామని కోదండరాం తెలిపారు. రేణుకపై ఫిర్యాదు చేస్తూ రేపు అన్ని డీసీసీల నేతలకు జిల్లా జేఏసీలు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు.
రేపటి జేఏసీ సమావేశం ఎల్లుండికి వాయిదా
రేపు జరగాల్సిన తెలంగాణ రాజకీయ జేఏసీ సమావేశాన్ని ఎల్లుండికి వాయిదా వేస్తోన్నామని కోదండరాం ప్రకటించారు. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల సమావేశాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు.
రేణుకా చౌదరి క్షమాపణ చెప్పాలి : శ్రీనివాస్‌గౌడ్‌
తెలంగాణ అమరవీరుల బలిదానాలను చులకను చేస్తూ మాట్లాడిన కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి బహిరంగ క్షమాపణ చెప్పాలని జేఏసీ నేత శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. లేకపోతే రేణుకకు తెలంగాణలో తగిన గుణపాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు. రేణుక అహంకారపూరితంగా తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *