జనం సాక్షి/ కొల్చారంరాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ నెల 3 న జిల్లాలోని 76 రైతు వేదికలలో రైతు దినోత్సవ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి లోని రైతు వేదికలోరైతు దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు, ఏఈఓలతో మాట్లాడుతూ వేదిక పరిసర ప్రాంతాలను శుభ్రపరచి మామిడి తోరణాలు, పువ్వులు, విద్యుత్ దీపాలతో మూడు రోజుల పాటు అద్భుతంగా అలంకరించాలన్నారు. వేదిక ప్రాంగణంలో ఉన్న ధాన్యాన్ని వెంటనే తూకం వేసి మిల్లులకు తరలించాలని, పరిసర ప్రాంతాలను శుభ్రపరచి, దుమ్ము లేవకుండా నీళ్లు చల్లి, ముగ్గులు వేయాలన్నారు. రైతు వేదిక ప్రాంగణాలలోను, హాలు లోపల వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలపై ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేయాలన్నారు. వేయి మందితో కార్యక్రమం నిర్వహించేలా రైతు వేదిక ప్రక్కనే షామియానాతో చక్కటి వేదిక ఏర్పాటు చేయాలన్నారు. సభలో రైతు బందు సమితి నాయకులు, సర్పంచులు, , జెడ్పిటిసిలు,ఎంపిటిసిలు, మండలాధ్యక్షులు, పాక్స్ చైర్మన్లు, వ్యవసాయ,ఉద్యాన అధికారులతో పాటు మండల స్థాయిలోని వివిధ శాఖల అధికారులు పాల్గొనేలా అందరిని ఆహ్వానించాలని సూచించారు. సభలో ఉచిత విద్యుత్, సాగునీరు, రైతు బందు, రైతు భీమా, తదితర పధకాల గురించి వివరించడంతో పాటు వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతిపై ప్రచురించిన కరపత్రాలు పంపిణి చేయాలన్నారు. అభ్యుదయ రైతులు, రైతు భీమా పొందిన లబ్ధిదారులతో మాట్లాడించాలన్నారు. కార్యక్రమం అనంతరం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహపంక్తి భోజనాలు ఏర్పాట్లు చేయాలన్నారు.
రైతుదినోత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు




